ఏపీలో తమ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేస్తామని…. 2018 నాటికి గ్రావిటీతో నీరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పోలవరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులని గవర్నర్ నరసింహన్, కేంద్ర జలవనరులు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆయన పరిశీలించారు.
ఇప్పటి వరకూ 20 సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించానని… 21వ సారి మంత్రి గడ్కరీతో కలిసి రావడం సంతోషంగా ఉందని సీఎం చెప్పారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికి కూడా జీవనాడి ప్రాజెక్టని, దీని నిర్మాణం పూర్తి చేసేందుకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు. నిర్మాణ పనుల ప్రగతిని జలవనరుల శాఖ అధికారులు వివరించారు.
ప్రస్తుతం నీరు ఎంతో అవసరమని.. పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోపు ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో పూర్తిచేస్తామని అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల, పోలవరం నిర్మాణ పనులను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని గవర్నర్ నరసింహన్ చెప్పారు. ఈ పర్యటనలో కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిదులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.