ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. జగన్‌కు ఎలాగైనా విజయాన్ని అందిచాలన్న పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే పీకే ఏపీలోని అన్ని నియోజక వర్గాల్లో ప్రత్యేక సర్వే చేయించారని సమాచారం. నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి ఎలా ఉంది.. నియోజకవర్గాల్లో వైసీపీ ఓటు బ్యాంకు తగ్గిందా.. లేక అలానే ఉందా.. వైసీపీ నేతలు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఏమనుకుంటున్నారు. క్యాడర్ మనోభావాలు ఎలా ఉన్నాయి.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఉన్నారా.. లేదా.. ఇదే విషయాలపై ఇటీవల ప్రశాంత్ కిషోర్ టీం సర్వే చేయించారు. జగన్ లండన్ పర్యటనకు వెళ్లకముందు ఈ తాజా సర్వేను ప్రారంభించారట.
నంద్యాల కాకినాడ ఎన్నికల తర్వాత జరిపిన ఈ సర్వేలో వైసీపీ ఓటు బ్యాంకుకు పెద్దగా నష్టం జరగక పోయినా.. ఏ నియోజకవర్గాల్లో వైసీపీ బలహీనంగా ఉందనేది కూడా తేల్చారట. దాదాపు 35కు పైగా శాసనసభ స్థానాల్లో వైసీపీ కొంత బలహీనంగా ఉన్నట్లు ప్రశాంత్ కిషోర్ టీం సర్వే నివేదికలో తేలినట్లు తెలిసింది. దీంతో ఈ 35 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని జగన్ భావిస్తున్నారు. ఇక్కడ నాయకత్వంసరిగా లేకపోవడం, లీడర్లు ఉన్నప్పటికీ సమన్వయం లేకపోవడం, అలాగే టీడీపీ నేత బలంగా ఉండటం కూడా కారణాలుగా సర్వేలో తేలింది. అవసరమైతే ఈ నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని మార్చాలని కూడా పీకే సూచించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ఓటు బ్యాంకుకు పెద్దగా నష్టం కలగలేదని సర్వేలో వెల్లడవ్వడంతో జగన్ తోపాటు వైసీపీ సీనియర్ నేతలు కూడా ఊపిరిపీల్చుకున్నట్లు తెలుస్తోంది.