ఏపీలో లో జాతీయ రహదారులు, జల రవాణా ప్రాజెక్టులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.2,539.08 కోట్ల వ్యయంతో 250.45 కి.మీ మేర నిర్మించనున్న ఆరు జాతీయ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించారు.
వీటితోపాటు రూ.1.614.03 కోట్ల వ్యయంతో 381.9 కి.మీ మేర ఆధునికీకరణ, అభివృద్ధి పనులు పూర్తయిన ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ దేశంలో 80 శాతం రవాణా జాతీయ రహదారులపై జరుగుతోందని అన్నారు.
ప్రస్తుతం రోజు 28 కిలోమీటర్ల మేరకు కొత్త జాతీయ రహదారిని నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రైలు, రోడ్డు మార్గాల్లో రద్దీ నియంత్రణ, చౌకైన ప్రయాణానికి అవకాశం ఉంటుందన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జాతీయ రహదారుల నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు.