తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు గుప్పించారు.ఈ రోజు ఖమ్మం జిల్లాలో పాలేరులో పాత కాలువను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ పట్టువదలని విక్రమార్కుడిలా భక్త రామదాసు ప్రాజెక్టును 9 నెలల్లోనే పూర్తి చేయించారని కొనియాడారు. అదే స్ఫూర్తితో నేడు పాలేరు పాత కాలువ పనులను ఏడాదిన్నర బదులు, మూడు నెలల్లోనే పూర్తి చేసి తుమ్మల రికార్డు సృష్టించారన్నారు. తుమ్మలను చూసి తాము ఎంతో నేర్చుకుంటున్నామని ఆయన చెప్పారు.
మంత్రి ఇంకా మాట్లాడుతూ తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్నదే సీఎం కేసీఆర్ కల అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ప్రాజెక్టల పేరుతో కాంగ్రెస్ నేతలు తమ జేబులను నింపుకున్నారే తప్ప.. ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని మంత్రి చెప్పారు. రైతుల శ్రేయస్సు కోసమే ఒక్కొక్క ప్రాజెక్టును వేగంగా పూర్తిచేస్తున్నామని అన్నారు ..