జలయజ్ఞం..సమైక్య పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పేరిట చేపట్టిన ఈ కార్యక్రమం ఎవరికి కాసులు కురిపించిందో అందరికీ తెలుసు. తెలంగాణ పరిధిలో రాళ్లపై పేర్లు చెక్కించుకొని, శిలాఫలకాలు ఆవిష్కరించుకొన్నారు. వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు లెక్కలు రాసుకున్నారు. కానీ ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. చుక్కనీరు రైతులకు అందలేదు. మూడేండ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పుష్కర కాలం కిందట మొదలై ఆగిపోయిన పాలెంవాగు, కిన్నెరసాని ఎడమకాల్వ పను లు వేగం పుంజుకొన్నాయి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరువతో ఆ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయించారు. ఈ రోజు మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు ఈ రెండు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
కిన్నెరసాని కింద పదివేల ఎకరాలకు సాగునీరు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లోని పదివేల ఎకరాలకు కిన్నెరసాని ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందనుంది. వాస్తవంగా జెన్‌కోకు నీళ్లిచ్చేందుకుగాను 8.4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి పదివేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో ఈ కెనాల్ ప్రాజెక్టును 2005లో మొదలు పెట్టినా, భూసేకరణ, డిజైన్ల లోపం, అటవీ అనుమతుల కారణాలతో ఆగిపోయింది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్రతివారం కిన్నెరసాని కెనాల్ ప్రాజెక్టు భూసేకరణ, ఇతర అనుమతులు, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. 2015లో నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించారు. 2016లో 5500 ఎకరాలు.. ఇప్పుడు పది వేల ఎకరాలు. ఆరు కిలోమీటర్ల మేర 45 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నిర్మించిన కుడికాల్వ కింద మూడు వేల ఎకరాలు, 20 కిలోమీటర్ల మేర వంద క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో చేపట్టిన ఎడమ కాల్వ కింద ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు మొదలైన 12 ఏండ్ల తర్వాత తొలిసారిగా పూర్తి ఆయకట్టుకు సాగునీరు రానుండటంతో ఆయకట్టు రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.