తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఇచ్చిన సరదా సమాధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.రెండు రోజుల క్రితం దసరా పర్వదినం సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రావణుడి పైకి శ్రీరాముడు బాణం వేస్తున్నట్లుగా ఉన్న ఫోటోను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేసాడు .
దీనిపై ఓ నెటిజన్ కేటీఆర్! సర్ జాగ్రత్త ‘జై’ వస్తున్నాడు అని సరదాగా పోస్ట్ పెట్టాడు. ఇటీవల నటుడు జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినేయంతో జై లవ కుశ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమాలో జై పాత్రధారి.. రావణాసురుడిని దహనం చేస్తుంటే ఆపుతాడు. ఈ నేపథ్యంలో సదరు నెటిజన్.. కేటీఆర్ పెట్టిన రావణ దహనం పోస్టుకు సరదాగా జై వస్తున్నాడు అని పెట్టాడు.
దీనిపై మంత్రి కేటీఆర్ కూడా అంతే సరదాగా స్పందిస్తూ …. సోదరా.. ఆందోళన అవసరం లేదని చెబుతూ.. తారక్ (ఎన్టీఆర్) నాకు మంచి స్నేహితుడు అని, ఆయన ‘జై’ గురించి చూసుకుంటాడని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.