ఈ రోజు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును అఖిల భారత కుర్మ సంఘం ప్రతినిధులు కలిశారు. గొల్లకుర్మలకు ప్రభుత్వం చేపట్టిన పథకం పట్ల కుర్మ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ వర్గానికి ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడం గొప్ప విషయమని ప్రతినిధులు సీఎం కేసీఆర్ ను కొనియాడారు. గొల్లకుర్మల అభివృద్ధి కంకణం కట్టుకున్నామన్న సీఎం.. వారి సంఘం వసతి గృహానికి పదెకరాల స్థలం, రూ. 10 కోట్లను సహాయం ప్రకటించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గొల్లకుర్మలకు ఇప్పటి వరకు 23.80 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని తెలిపారు. గొర్రెల పంపిణీ పథకం కింద 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. అన్ని గొర్రెలను ఎక్కడినుంచి తీసుకువచ్చి పంపిణీ చేస్తారని తనను చాలా మంది ఎద్దెవా చేశారని గుర్తు చేశారు. అటువంటి వారికి.. ఇంత పెద్ద ఎత్తున ఇప్పటికే గొర్రెలు పంపిణీ చేయడం ఒక సమాధానమని తెలిపారు. ప్రజలకు సరిగ్గా పని చేస్తే అంతా మేలు జరుగుతుందన్నారు. కేవలం మాటలతో కాలం వెళ్ళబుచ్చడం సరైంది కాదన్నారు సీఎం. తాను ప్రజా జీవితంలో 40 సంవత్సరాలకు పైగా ఉన్నాను. తెలంగాణ కోసం పోరాడాను. అందుకే ప్రజలకు ఏం చేయాలనే విషయంలో తనకు స్పష్టత ఉందని సీఎం తెలిపారు. గొల్లకుర్మల అభివృద్ధికి కంకణం కట్టుకున్నామని ఉద్ఘాటించారు.
గొల్లకుర్మల వసతి గృహానికి పదెకరాల స్థలం
గొల్ల కుర్మల సంఘం వసతి గృహానికి పదెకరాల స్థలం, రూ. 10 కోట్లను సహాయంగా ప్రకటించారు సీఎం కేసీఆర్. రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌లో అఖిల భారత షెపర్డ్ కమ్యూనిటీ సభలు జరుపుతామన్నారు. అప్పటికీ ప్రపంచంలోనే ధనవంతమైన వారిగా గొల్లకుర్మలు రూపుదిద్దుకుంటారు అని తెలిపారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం లేని బీసీలకు మండలిలో ప్రాతినిధ్యం ఇస్తామన్నారు సీఎం.
ఉత్పత్తి చేయలేనిది ఏమీ లేదు
ప్రకృతి మనకిచ్చిన అపార సంపదతో ఉత్పత్తి చేయలేనిది ఏమీ లేదని సీఎం స్పష్టం చేశారు. అన్ని వనరులను ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మానవ వనరుల అభివృద్ధికి కంకణం కట్టుకున్నామని ఉద్ఘాటించారు. తెలంగాణ కోసం పోరాడుతున్న రోజుల్లో దేశంలోని అన్ని పార్టీల నాయకులకు గంటల తరబడి పోరాట ఆవశ్యకతను వివరించాను అని గుర్తు చేశారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏం చేస్తే మంచిదో బాగా ఆలోచించామని చెప్పారు. తెలంగాణ గురించి అర్థం చేసుకోవడానికి చాలా అధ్యయనం చేశామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ అధ్యయనం కొనసాగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి ప్రజలకు మేలు జరగలేదన్నారు సీఎం.