తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ కండువా కప్పుకోకుండా కాంగ్రెస్ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి మాట్లాడుతూ కోదండరామ్ ముసుగు పూర్తిగా తొలిగిపోయిందని, ఆయన అభివృద్ధి నిరోధక కాంగ్రెస్ అజెండాను అమలు చేసే పనిలో ఉన్నారని మండిపడ్డారు. రైతు సమన్వయ సమితిల రద్దుకై సత్యాగ్రహం చేయాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కోదండరామ్ సమర్థించడం దారుణమన్నారు. కాంగ్రెస్‌కు అండగా నిలిచిన కోదండరామ్ దేనికోసం సత్యాగ్రహం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు.
ఉమ్మడి పాలకుల హయాంలో దూరమైన పాలన ఇప్పుడిప్పుడే తమకు చేరువవుతున్నదని ప్రజలు సంతోషంగా ఉన్న సమయంలో కోదండరామ్ అభివృద్ధి వ్యతిరేక శక్తుల అజెండాను భుజానికెత్తుకోవడం సిగుచేటని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఒక బాధ్యత కలిగిన పౌరుడు గా సహకరించాల్సింది పోయి అభివృద్ధికి అడ్డుపడాలన్న కుట్రతో సత్యాగ్రహం చేస్తానని ప్రజలను గందరగోళం చేస్తున్నారన్నారు. తెలంగాణకు వ్యతిరేకమైన టీడీపీ, తెలంగాణ ఇవ్వవద్దని తీర్మానించిన సీపీఎం వంటి పార్టీలతో కలిసి పని చేస్తున్న కోదండరామ్ తెలంగాణకు నష్టం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ నేతలు అసలు ఎందుకు సత్యాగ్రహం చేస్తున్నారో చెప్పాలని ఎమ్మెల్సీ కర్నె ప్రశ్నించారు. ‘ అసలు ఎందుకు సత్యాగ్రహం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి. కోటి ఎకరాలకు సాగు నీరు ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నందుకా?. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అదునుకు ముందే విత్తనాలు, ఎరువులను ఎక్కడికక్కడ అందుబాటులో పెడుతున్నందుకా?. వ్యవసాయరంగానికి 24 గంటల విద్యుత్ సరఫరాచేస్తున్నందుకా?. రైతుల కష్టాలను తొలగించడానికి రూ.17వేల కోట్ల రుణాలను మాఫీ చేసినందుకా?. భూసార పరీక్షలు, పంటల మార్పిడిపై అవగాహన, నకిలీ విత్తనాలను అరికట్టే చర్యలు, నకిలీ విత్తనాలు అమ్మే డీలర్ల నుంచే రైతులకు పరిహారం ఇప్పించడం వంటి నిర్ణయాలను ఓర్చుకోలేకనా?. ఎకరానికి రూ.8వేల చొప్పున పెట్టుబడి కింద రైతులకు ఇవ్వడం ఇష్టం లేకనా?. గత ప్రభుత్వాలు పట్టించుకోక చెల్లాచెదురైన రైతులందరని సంఘటితం చేసి వారిని ఆదుకోవడానికి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేయడాన్ని జీర్ణించుకోలేకనా?“అని కర్నె ప్రభాకర్ దుయ్యబట్టారు. సింగరేణి ఎన్నికలలో టీబీజీకెఎస్‌ను ఓడించాలని కోదండరామ్ పిలుపునివ్వడాన్ని బట్టే ఆయన కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారని ప్రజలకు అర్ధమైందన్నారు. కోదండరామ్‌కు నిజంగా తెలంగాణ గడ్డపై ప్రేమ ఉంటే అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు ఆపాలని ఆయన కర్నె డిమాండ్ చేశారు.