తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు భారీ నీటి పారుదల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పూర్తిచేస్తోన్న సంగతి తెలిసిందే .
తాజాగా పాలెంవాగును పూర్తి చేసి.. మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని గత ఏడాది అక్టోబరులో శాసనమండలి వేదికగా ఇచ్చిన హామీని మంత్రి హరీశ్‌రావు నిలబెట్టుకొన్నారు. ఇప్పటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో పదివేల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు పాలెంవాగు చేపట్టారు. ప్రాజెక్టు ప్రారంభ సమయంలో అంచనావ్యయం రూ.70.99 కోట్లు కాగా.. పనుల్లో భాగంగా నిర్మించిన బండ్‌కు 2006, 2008లలో రెండుసార్లు గండిపడింది.
50వేల క్యూసెక్కుల సామర్థ్యంతో డిజైన్ చేయగా..86వేల క్యూసెక్కుల ప్రవాహం పాలెంవాగుకు రావడంతో దాని డిజైన్‌పై పునఃపరిశీలన జరుపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మిగిలిన 36వేల క్యూసెక్కుల వరద వెళ్లేందుకుగాను 2010లో రూ.80 కోట్ల వ్యయంతో నాలుగు ద్వారాలు (వెంట్స్)ఉండేలా నాన్‌గేటెడ్ స్పిల్ నిర్మించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టిసారించి.. 2017లో రూ.221 కోట్లతో సవరణ అంచనావ్యయం రూపొందించి భూసేకరణ సమస్యలకు పరిష్కారం చూపారు.