ఏపీలో అధికారం చెలాయిస్తున్న చంద్రబాబు.. తెలంగాణ టీడీపీపై పెద్ద బాంబు పడే సూచనలు కనిపిస్తున్నాయా.. మరో ఏడాదిన్నరలో జరగబోయే ఎన్నికల సమయానికి పార్టీ తీవ్రమైన సమస్యల్లో చిక్కుకుపోనుందా.. కీలకమైన నేతలు పార్టీ మారేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారా.. దీంతో నియోజకవర్గాలకు నియోజకవర్గాలే టీడీపీ ఖాతా నుంచి చేజారిపోతున్నాయా.. అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు విశ్విస్తున్న, ప్రజల్లో బలంగా ఉన్న పార్టీల వైపు టీడీపీ నేతలు మొగ్గుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం భువనగిరికి సంబంధించిన కీలక విషయం ఒకటి వెలుగు చూసి సంచలనం రేపుతోంది. నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నేతలు ఉన్నారు. ఎలిమేని మాధవరెడ్డి గతంలో అన్నగారి హయాం నుంచి ఇక్కడ టీడీపీ తరఫున చక్రం తిప్పుతున్నారు. దీంతో ఇక్కడ టీడీపీకి తిరుగులేకుండా పోయింది. అయితే, మాధవ రెడ్డి హఠాన్మరణం తర్వాత ఆయన భార్య ఉమా రాజకీయ ప్రవేశం చేశారు. ఈమెకు గతంలో చంద్రబాబు తన కేబినెట్‌లో చోటు కూడా కల్పించారు. దీంతో ఉమా తన భర్తలేని లోటు తెలియకుండా నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారు.
అయితే ఇప్పుడు పరస్థితులు మారాయి. విభజన తర్వాత దాదాపు చంద్రబాబు తెలంగాణపై దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా జీహెచ్ ఎంసీ ఎన్నికల తర్వాత ఆయన తెలంగాణలో ఎక్కడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన దాఖలాలు కూడా లేవు. దీనికితోడు ఓటుకు నోటు కేసు కొన్నాళ్లు హల్‌చల్ చేసింది. దీంతో ఏకంగా తెలంగాణ నుంచి చంద్రబాబు తన మకాంను ఏపీకి మార్చేశారు. దీంతో తెలంగాణ టీడీపీలో కేడర్ పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బలమైన నేత ఒక్కరూ కనిపించడం లేదనే భావన నెలకొంది. రేవంత్ రెడ్డి ఉన్నా.. కొన్ని జిల్లాల్లోనే ఆయన ప్రభావం ఉంది. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ హైదరాబాద్ సరిహద్దు విడిచిపెట్టడం లేదు. దీంతో ఎక్కడికక్కడ నేతలు అభద్రతా భావంలో ఉన్నారు. ఈ క్రమంలోనే భువనగిరికి చెందిన ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి కూడా తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సైకిల్ దిగేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే అధికార పార్టీలోకి కాకుండా కాంగ్రెస్‌లోకి ఆమె జంప్ చేస్తారని అంటున్నారు. అధికార పార్టీలో ఇప్పటికే పోటీ తీవ్రంగా ఉండడంతో టికెట్ లభించే అవకాశం తక్కువగా ఉందని తెలియడంతో కాంగ్రెస్‌లోకి జంప్ చేస్తారని అంటున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి తెర వెనుక స్కెచ్ పూర్తయిందని త్వరలోనే ఉమా టీడీపీని వీడడం ఖాయమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.