కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్క.. విశ్వనటుడు మల్ హాసన్ రాజకీయ రంగప్రవేశంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తమ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే వీరిద్దరూ పలు వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ ఒకడుగు ముందుకేసి అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ కొత్తపార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ఇదిలా ఉంటే కమల్ పై రజినీ వేసిన కౌంటర్ ఇప్పుడు తమిళ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
తాజాగా దివంగత దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ స్మారకార్థం నిర్మించిన మణిమండపం ను తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఆదివారం చెన్నైలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రజినీకాంత్, కమల్ హాసన్‌తో పాటు తమిళ రాజకీయ, సినీ ప్రముఖులంతా విచ్చేశారు. ఇక పన్నీర్ సెల్వం ప్రసంగించిన అనంతరం మైక్ అందుకున్న రజినీకాంత్.. రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలవాలంటే సినిమా, పేరు ప్రతిష్టలు సరిపోవు. ఇంకేదో కావాలి. అదేంతో ప్రజలకు బాగా తెలుసు. నాకు మాత్రం నిజంగా తెలీదు. బహుశా అదేంటో కమల్ హాసన్‌కు తెలుసని నేను అనుకుంటున్నాను (నవ్వుతూ) అని సుతిమెత్తగా కౌంటర్ వేశారు రజినీకాంత్. అనంతరం కమల్ హాసన్ కూడా ప్రసంగించారు. అయితే ఆయన ఎలాంటి ఆసక్తికర, వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. మొత్తానికి ఇప్పటికే ఈ ఇరువురు హీరోల రాజకీయ రంగ ప్రవేశంపై జరుగుతున్న చర్చకు ఇది మరింత ఆజ్యం పోసింది.