సింగరేణి అంటే సీఎం కేసీఆర్‌కు గుండె నిండ ప్రేమ ఉంటదని ఎంపీ కవిత కొనియాడారు. జిల్లాలోని మందమర్రి మార్కెట్‌లో ఇవాళ టీజీబీకేఎస్ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత, విప్ నల్లాల ఓదెలు, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారు వివేక్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్‌రావు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. పలువురు జాతీయ సంఘాల నేతలు ఈ సందర్భంగా టీబీజీకేఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ కవిత… 60 ఏండ్లలో ఏ ముఖ్యమంత్రి సింగరేణిని అర్థం చేసుకోలేదన్నారు. సింగరేణి కార్మికులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. తెలంగాణ ఏర్పడగానే అసెంబ్లీ సాక్షిగా వారసత్వ ఉద్యోగాలు ఇస్తమని సీఎం కేసీఆర్ ప్రకటించారని ఆమె గుర్తు చేశారు. కార్మికులను మభ్యపెట్టి మోసం చేసేందుకు ప్రతిపక్ష నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నరని కవిత ఆరోపించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సిరుల గనిగా మరుతదని ఆమె స్పష్టం చేశారు. ఏ శాఖలో ఉద్యోగాలిస్తామన్నా కోర్టుకు పోతున్నరు.. అడ్డుకుంటున్నరని.. ఎవరెన్ని కుట్రలు చేసినా ఇచ్చి తీరుతమని కవిత ఉద్ఘాటించారు. మారుపేరుతో పనిచేసేవారికి న్యాయం చేస్తామని ఆమె చెప్పారు. మెడికల్ అన్‌ఫిట్ వాళ్ల జీతాలు తగ్గకుండా చూస్తమని ఆమె హామీ ఇచ్చారు. ప్రమోషన్లలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని కవిత స్పష్టం చేశారు.
కోల్ ఇండియా తరహాలో కేడర్ స్కీం అమలు చేస్తామని ఆమె తెలియజేశారు. సింగరేణి పరిధిలో ఉన్న ఆసుపత్రులను మెరుగుపరుస్తమని ఈ సందర్భంగా వివరించారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం అందిస్తమని తెలిపారు. సింగరేణిలో ప్రతీ కార్మికుడి ఇంటికి ఏసీ సౌకర్యం కల్పిస్తమని కవిత హామీ ఇచ్చారు. కొత్తగా భూగర్భ గనులు ఏర్పాటు చేసుకొని మరింత మందికి సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తమన్నారు. కార్మికులను ఆగం చేసేందుకే ప్రతి పక్షాలన్నీ ఏకమైనయని.. చుక్క గుర్తోళ్లకు చుక్కలు చూపించాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.