దసరా పండుగ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండు గంటలకు పైగా ఎవరికీ అందుబాటులో లేకుండా మాయం కాగా, ఆయన ఎక్కడికి వెళ్లారన్న విషయం బయట పడిపోయింది. కుమార్తెను ఆక్స్ ఫర్డ్ వర్శిటీలో చేర్పించి, లండన్ నుంచి వచ్చిన తరువాత హైదరాబాదులోని లోటస్ పాండ్ ఇంటికే ఎక్కువగా పరిమితమైన జగన్, శుక్రవారం సీబీఐ కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యారు. ఆపై శనివారం నాడు దుర్గాష్టమి సందర్భంగా ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వకుండా, ఇంట్లో లేకుండా, భద్రతా సిబ్బందికి తెలియకుండా, వ్యక్తిగత వాహనంలో బయటకు వెళ్లిపోయారు. దాదాపు రెండున్నర గంటల తరువాత వెనక్కు వచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్లారన్న విషయంపై పచ్చ బ్యాచ్ విషప్రచారానికి తెరలేపింది.
జగన్, బీజేపీ ఎంపీ నివాసం వేదికగా జగన్, బీజేపీ నేతల మధ్య చర్చలు జరిగాయని టీడీపీ అనుకూల పచ్చ మీడియా చెప్పింది. ఇక అదే సమయంలో మరో విషయాన్ని కూడా సదరు పచ్చ మీడియా బ్యాచ్ కూడా అంగీకరించింది. బీజేపీ ఎంపీ కుమారుడు ఇటీవల హైదరాబాద్‌లో విలాసవంతమైన భవనం కట్టుకున్నారని ఆ ఇంటి వద్దకే జగన్ వెళ్లారని చెప్పింది. అయితే వైసీపీ శ్రేణులు చెబుతున్న అసలు విషయం మరోలా ఉంది. టీడీపీ అనుకూల మీడియా చెప్పినట్టుగానే సదరు బీజేపీ ఎంపీ కుమారుడు హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నారు. వారి ఇంట్లో ఇటీవల జరిగిన శుభకార్యానికి జగన్‌ను కూడా ఆహ్వానించారు. అయితే ఆయన ఆ సమయంలో లండన్ పర్యటనలో ఉండడంతో వెళ్లలేకపోయారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జగన్ సదరు ఎంపీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పినట్టు చెబుతున్నారు. సదరు ఎంపీ కూడా ఎవరో కాదు. నరసాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు. ఈయన ఇంటికే జగన్ వెళ్లినట్టు చెబుతున్నారు. జగన్ వెళ్లిన సమయంలో అక్కడ వివిధ పార్టీల నేతలు కూడా ఉన్నారు. వ్యక్తిగత సంబంధాలతో గోకరాజు ఇంటికి జగన్ వెళ్తే దాన్ని కూడా రాజకీయం చేయడం ఏంటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.