తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీలో హౌసింగ్ ,ఇతర అభివృద్ధి పనుల కోసం మొత్తం మూడు వందల మంది సివిల్ ఇంజినీర్లను అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించనున్నారు .దీనికి సంబంధించి పట్టణాభివృద్ధి ,ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ నిన్న శుక్రవారం ఫోన్ లో అనుమతి ఇచ్చినట్లు గ్రేటర్ అధికారులు తెలిపారు .
నెల రోజుల క్రితం ఇంజినీరింగ్ పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో సివిల్ ఇంజినీర్లను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు .ఈ క్రమంలో మొదటి విడతగా నూట ఇరవై ఆరు మందిని ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొన్నారు .ఎంపికైన వారికి వచ్చే నెల అక్టోబర్ ఐదు నుండి న్యాక్ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.
బీఈ ,బీటెక్ ,ఏఎంఐఈకు చెందిన అభ్యర్ధులకు మెరిట్ ప్రాతిపదికన అవకాశం కల్పిస్తాం అని ..రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు .ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు .మిగతా ఖాళీలను రెండో దశలో నియమిస్తామని పేర్కొన్నారు .క్షేత్ర స్థాయి పనులను పరిశీలించే వీరిని ఏడాది కాలపరిమితితో విధుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు ..