ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుండే నువ్వా- నేనా అనేరీతిలో దూసుకుపోతున్నాయి. ఇక టీడీపీ ఇంటింటా తెలుగు దేశం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళుతుండగా.. వైసీపీ మాత్రం జగన్ ప్రకటించిన నవరత్నాలు, గడప గడపకి వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాలతో దూసుకుపోతుంది.
ఇప్పటికే 50 లక్షల మంది వైయస్ఆర్ కుటుంబంలో చేరగా.. అనేక మంది నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీలోకి వచ్చి చేరుతున్నారు. ఇక వైసీపీ శ్రేణులకి దసరా ఫెస్టివల్ న్యూస్ ఏంటంటే.. మాజీ పార్లమెంటు సభ్యుడు సీనియర్ నేత అయిన చిమటా సాంబు గురువారం వైసీపీలో చేరారు. ఆయన టీడీపీని వీడి వైసీపీ గూటికి వచ్చారు.
చిమటా సాంబు గతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. చిమటా సాంబు టీడీపీలో అత్యంత సీనియర్ నేత. అయితే ఆయనను పార్టీ గత కొంతకాలంగా దూరంగా పెట్టింది. ఇక బలహీన వర్గాలకి చెందిన చిమటా సాంబు టీడీపీ పటిష్టత కోసం కృషి చేశారు. మూడు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని చిమటా సాంబు పార్టీలో చేరడంతో వైసీపీకి ప్రకాశం జిల్లాలో మంచి ఊపు వచ్చిందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.