తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సింగరేణి కార్మికుల గురించి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం పెట్టారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులతో పాటుగా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకు కూడా వరాల జల్లు కురిపించారు .ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ “గత ప్రభుత్వాలు కానీ జాతీయ సంఘాలు అని ఫీలవుతున్నవారు సింగరేణి లో పని చేస్తోన్న కార్మికుల అనారోగ్య సమస్యల గురించి అర్ధం చేసుకోలేదు .
తెలంగాణ ఏర్పడిన తర్వాత తాము మాత్రం ఇక నుంచి కార్మికులతో పాటుగా వారి తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని నిర్ణయించామని అన్నారు . డిపెండెంట్ ఉద్యోగాలు అర్ధం చేసుకోవడంలో కాంగ్రెస్, టీడీపీ విఫలమయ్యాయి. గతంలో పనిచేసిన కార్మిక సంఘాల వల్లే వారసత్వ ఉద్యోగాలు పోయాయి. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను గెలిపించాలి అని కోరారు . సింగరేణిలో అండర్‌గ్రౌండ్‌లో పనిచేసే కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వారికి ఆక్సిజన్ అందదు. మొకాలి చిప్పలు అరుగుతాయి. రిటైర్డ్ అయిన సింగరేణి ఉద్యోగులు పదేళ్లకంటే ఎక్కువ బతకలేరు.
వారికి వచ్చే జబ్బులు గతంలో ఎవరూ పట్టించుకోలేదు. మేం ఏ మంచి పనిచేద్దామన్నా వాటిని అడ్డుకునేందుకు, స్టేలు తెచ్చేందుకు కొన్ని ముఠాలు ప్రత్యేకంగా ఉన్నాయి.ఇరిగేషన్, ఉద్యోగాలు, నీళ్లు అన్నింటిని అడ్డుకునేందుకు కేసులు వేసేందుకు ఆ ముఠాలు పనిచేస్తుంటాయి.తెలంగాణ ఉద్యమ సమయంలోనే టీబీజీకేఎస్ పుట్టిందని గుర్తు చేశారు. జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ చాన్నాళ్లు గుర్తింపు సంఘాలుగా ఉన్నాయని, వాటి వల్లే వారసత్వ ఉద్యోగాలు పోయాయని ఆరోపించారు. వారసత్వ ఉద్యోగాలు
వదులుకుంటున్నట్లు సంతకాలు చేసింది ఆ సంఘాలేనన్నారు. గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల సమస్యలను, సింగరేణిని అర్ధం చేసుకోలేకపోయాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.