తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 5న సింగరేణి సంస్థ గుర్తింపు సంఘాల ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే .ఈ ఎన్నికల్లో ఇటు ప్రతిపక్షాలు కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన అనుబంధ సంఘాలు తరపున ప్రచారాన్ని తీవ్రతరం చేస్తుంది .అదే విధంగా అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తన అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ తరపున ప్రచారం మమ్మురం చేసింది .
ఈ సందర్భంగా సింగరేణి ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో మీడియా తో మాట్లాడారు . ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుందరికీ సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు.
దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ త్వరలోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాబోయే 25 రోజుల్లో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని మరోసారి ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు పెంచుతామని ప్రకటించారు. దసరా పండుగ తర్వాత అల్లం నారాయణతో సమావేశం ఏర్పాటు చేసి ఇండ్ల స్థలాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 2 లేదా 3 ప్రాంతాల్లో ఇండ్ల స్థలాల పరిశీలన జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. వీలైతే ఒకే చోట ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.