తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులపై దసరా పండగ సందర్భంగా వరాల జల్లు కురిపించారు .సింగరేణి కార్మిక గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు .మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “సింగరేణి కార్మికులకు వారసత్వ(డిపెండెంట్ ) ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు.వారసత్వ ఉద్యోగాల విషయంలో సింగరేణి కార్మికులు ఎవరు భయపడవద్దు ..తను సంబంధిత అధికారులతో మాట్లాడాను .
వారసత్వ ఉద్యోగాలకు అవకాశం ఉంది అని చెప్పారని అన్నారు . ఒకవేళ వారసత్వ డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినప్పటికీ వద్దనుకునే వారికి రూ.25లక్షలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు .అంతే కాకుండా గతంలో జాతీయ సంఘాల సాక్షిగా సింగరేణి కార్మికులు వారసత్వ ఉద్యోగాలు కోల్పోయారు. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. ఉద్యోగం వద్దనుకునే కార్మికులకు రూ.25లక్షలు ఇస్తాం. గతంలో రూ.12వేలు ఉన్న జీతాలు ఇక నుంచి నెలకు రూ.25 వేలు అందిస్తాం. సింగరేణిలో 14 నుంచి 19 వేల మంది వేర్వేరు పేర్లతో ఉద్యోగులు ఉన్నారు. ఇక నుంచి వారిని ఒకే పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాం. కార్మికులకు, వారి పిల్లలకు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటాం.
రూ.6లక్షల వరకు వడ్డీ లేకుండా ఇంటి లోన్లు ఇప్పిస్తాం. సింగరేణిలో లాభాలు గతంలో 16శాతం ఇచ్చేది.. దానిని 25శాతానికి పెంచాం. దసరా అడ్వాన్స్‌ను కూడా పెంచాం.వారసత్వ ఉద్యోగాల స్థానంలో కారుణ్య నియామకాలు చేసేందుకు టీబీజీకేఎస్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిపై మిగితా సంఘాలు తమ వైఖరి చెప్పాలి. చిల్లర రాజకీయాలు చేసే ఉద్దేశం నాకు లేదు. 3527 డిపెండెంట్ ఉద్యోగాలు పెండింగ్‌లో ఉన్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకే డిస్మిస్ అయిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చాయి. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు రూ.25లక్షలకు నష్టపరిహారం పెంచాం. టీబీజీకేఎస్ గెలిచింది ఒక్కసారి మాత్రమే. వారసత్వ ఉద్యోగాలు ఎక్కడికీ పోవు. సాధ్యం కానిపనులు నేను చచ్చినా చెప్పను. యాజమాన్యం కొన్నిసార్లు కక్షపూరితంగా వ్యవహరించి డిస్మిస్ చేసింది. దాదాపు 500 మందిని తిరిగి చేర్పించాం. మేం వచ్చాకే దాదాపు 7వేల ఉద్యోగాలు ఇచ్చాం. నిన్నమొన్న కూడా 650′ అని ఆయన తెలిపారు.