తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో జరగనున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యిందని ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గ టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.రానున్న ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపు ఖాయమని, విజయం ఘనంగా ఉండాలనే తమ ప్రయత్నం ఆయన అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 7 షాఫ్ట్ గని మీద జరిగిన ఎన్నికల ప్రచారంలో జడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, టీఆర్ఎస్ నేతలు కంచర్ల చంద్రశేఖర్ రావు, గోపాల్ రావు, జేవీఎస్ చౌదరి, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “జాతీయ కార్మిక సంఘాల అబద్దపు ప్రచారాలను నమ్మొద్దని సింగరేణి కార్మికులకు సూచించారు. వారం పది రోజులుగా అన్ని సంఘాల ప్రచారాన్ని కార్మికులు చూస్తున్నారని, ఏది నిజమో, ఏది అబద్దమో గ్రహించారని ఆయన అన్నారు.
టీబీజీకేఎస్ సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని భరోసా ఇచ్చారు. గడిచిన వారం రోజుల్లో కొత్తగూడెం ఏరియాలో 1826 మంది సింగరేణి కార్మికులు టీబీజీకేఎస్ లో చేరారని ఎంపీ ఈ సందర్భంగా వివరించారు. సీఎం కేసీఆర్ మీద కార్మికులకు నమ్మకం పెరగడమే చేరికలకు కారణమన్నారు.ఈ సందర్భంగా పలు సంఘాల నుంచి పలువురు కార్మికులు టీబీజీకేఎస్ లో చేరారు. ఎంపీ పొంగులేటి, జడ్పీ చైర్ పర్సన్ కవిత వారికి గులాబీ కండువాలు కప్పి సంఘంలోకి ఆహ్వానించారు.