తెలంగాణ రాష్ట్రంలో సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణలో ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నది.తెల్ల కాగితంపై ఐదెకరాలకు పైబడి కొనుగోలు చేసిన భూములనూ సాదాబైనామా ద్వారా క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. పాత దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులపై చర్చించిన అధికారులు సీఎం కేసీఆర్ అనుమతితో ఐదెకరాలకు పైబడిన భూములకు రెవెన్యూ చట్టాల మేరకు డ్యూటీ తీసుకొని క్రమబద్ధీకరించి, యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించారు. ఎంతో కాలంగా క్రమబద్ధీకరణకోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ నిర్ణయంతో ఊరట కలిగింది.
వరంగల్‌లో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని వ్యవసాయ భూములను కూడా సాదాబైనామా ద్వారా క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. 2016లో సాదాబైనామా క్రమబద్ధీకరణకు దరఖాస్తుల స్వీకరణ సందర్భంలో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిలో సాదాబైనా మాల ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు జరినప్పటికీ వాటిని క్రమబద్ధీకరించరాదని నిర్ణయించారు. అర్బన్ ప్రాంతాల్లో ఉండే పరిస్థితిని బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దరఖాస్తులు కూడా స్వీకరించలేదు.
కానీ కుడా పరిధిలో వ్యవసాయ భూములున్నాయి. చాలామంది పేద రైతులు భూములు కొనుగోలు చేసి, వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకునే స్థోమత లేక కేవలం తెల్లకాగితాలపైనే రాసుకున్న ఉదంతాలు అనేకం. కుడా పరిధిలోని రైతులు తమకు సాదాబైనామా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై లోతుగా చర్చించిన సీఎం కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేశారు. కుడా పరిధిలోసాదాబైనామా భూములు క్రమబద్ధీకరణకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తర్వులు జారీ అయిన నాటి నుంచి 15 రోజుల పాటు దరఖాస్తులను కుడా పరిధిలో స్వీకరించాలని వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.