తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం ,భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని రైతుల శ్రేయస్సుకు, ఉన్న పంటను రక్షించడం కోసం అవసరం అయితే తాగునీటి నుంచయినా సాగునీరు అందిస్తానని మంత్రి తుమ్మల రైతులకు ఖరీఫ్ పంట అంశంలో హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలోని కల్లూరులో నూతనంగా రూ. 1.10 కోట్లుతో నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
జిల్లా అభివృద్ధితోపాటు తన రాజకీయ ఎదుగుదలకు కారణం అయిన సత్తుపల్లి నియోజవర్గానికి ఎవరు ఎమ్మెల్యేగా, ఎవరు ఎంపీగా ఉన్నా ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నారు. కల్లూరు రెవెన్యూ డివిజన్‌కు అన్ని నూతన డివిజన్ కార్యాలయాలు వస్తాయని పేర్కొన్నారు. మండలంలో మిగిలిపోయిన రహదారులను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తానని అన్నారు. సాగర్‌లో నీరు ఉంటే ఏనాడూ రైతుల పంట ఎండబెట్టలేదని, కొందరు రాజకీయ లబ్ధికోసం చెప్పే మాటలు నమ్మనవసరం లేదన్నారు.
గతంలో ఖరీఫ్, రబీ పంటలకు చివరి తడులు అందించి కాపాడానని, ప్రస్తుతం ఖరీఫ్‌నూ కాపాడుతానని అన్నారు. గోదావరి నీరు కల్లూరు సాగర్ కాల్వలో పడితేనే రైతుల నీటి కష్టాలు పోతాయని, దానికోసం నిర్విరామంగా కృషి చేస్తానని తెలిపారు. ఏ ఇంటిలోనూ విద్యుత్తు సమస్య లేకుండా, బతుకమ్మ ఆడిన ప్రతి ఆడపడుచు ఇంటికి నల్లా వచ్చేలా చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తమ్మల మహిళలతో కలసి బతుకమ్మ ఆడారు. అనంతరం వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీలో భాగంగా యర్రబోయినపల్లి రైతులకు ఆర్‌కేఈవై పథకం నుంచి రాయితీపై వరికోతయత్రం అందజేశారు.