ఏపీలో విషజ్వరాల బెడదతో పలువురు మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక నెల వ్యవధిలో డెంగీ వ్యాధి కారణంగా ముప్పై ఐదు మంది మరణించారని చెబుతున్నారు.వేలాది మంది అనారోగ్యం పాలవుతున్నారని, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని సమచారం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200కు పైగానే డెంగీ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ గుర్తించింది. ప్రభుత్వ దృష్టికి రానివి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిగణనలోకి తీసుకుంటే సుమారు 1000 మంది వరకు డెంగీ బాధితులు ఉండవచ్చని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 35 మంది డెంగీతో మృతి చెందగా, ప్రభుత్వం మాత్రం సరైన లెక్కలు చెప్పడం లేదు. మంగళ, బుధవారాల్లో ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఆరుగురు డెంగీతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వరదయ్యపాలెం, సత్యవేడు, పాలసముద్రం, నాగలాపురం, పిచ్చాటూరు మండలాలకు చెందిన అశోక్ (19), డానియల్ (9), జ్యోషిత (3), రమణమ్మ (75), అంకమ్మ (40), సువర్ణ (14)లు మృత్యువాత పడ్డారని మీడియా కధనాలు సూచిస్తున్నాయి.
