తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనారోగ్యంతో దాదాపు ఏడాది క్రితం చెన్నై నగరంలోని ప్రముఖ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిలో చేరారు. అయితే ఇలా ఆస్పత్రిలో చేరే ఒక రోజు ముందు జయలలిత విమానాశ్రయం, లిటిల్ మౌంట్‌రోడ్డు మధ్య మెట్రోరైలు మార్గాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన సమయంలో జయలలిత మామూలుగానే ఉన్నారు. అంతే కాదు ఆరోగ్యంగా అమ్మ తన కార్యక్రమాలను కొనసాగించారు. మరుసటిరోజైన సెప్టెంబరు 22వ తేదీన ఆస్పత్రిలో చేరారు.
తర్వాతి రోజు ఉదయం డీహైడ్రేషన్, జ్వరంతో జయలలిత ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు హెల్త్ కు సంబంధించిన వివరాలతో ఉన్న ఒక ప్రకటనను విడుదల చేశారు. అక్కడి నుంచి దాదాపు 75 రోజులపాటు ఆమెకు వైద్య సేవలు అందాయి. మధ్యలో ఆమె కోలుకున్నారని, త్వరలోనే బయటకు వస్తారని, కానీ అది ఆమె నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వైద్యులు చెప్పారు. దీంతో అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడే చేతి వేలిముద్రలు తీసుకుని రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాలకు ఆ పార్టీ అభ్యర్థులు బీ ఫారాలు సమర్పించారు.
పరిస్థితి క్రమంగా విషమించడంతో డిసెంబరు 5న జయలలిత కన్నుమూశారు. ఇప్పుడు ఆమె చివరి రోజుల ఘటనలపై పెద్ద వివాదమే రేగుతోంది.దీంతో కేంద్రం తాజాగా రంగంలోకి దిగుతుంది .ఈ క్రమంలో జయలలిత చివరి రోజులలో చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు సంబంధిత వివరాలు సేకరిస్తున్నారని సమాచారం .దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని వివరణ కోరినట్లు కూడా తెలిసింది. వీటన్నింటి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరగుతుందోననే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.