కొండ చిలువకు సీటీ స్కాన్ చేసిన అరుదైన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన 8 అడుగుల ఆ భారీ సర్పానికి చికిత్స అందించడంలో భాగంగా ఈ ప్రక్రియ నిర్వహించారు. ఇండియాలో ఇలాంటి ఉదంతం ఇదే మొదటిది. ఒడిషాలోని కియోంజర్ జిల్లా అననాథ్‌పూర్ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు 4 రోజుల కిందట గాయాలతో బాధ పడుతున్న ఓ కొండ చిలువను గుర్తించారు. తల, శరీరంలోని ఇతర అంతర్గత భాగాల్లో తీవ్ర గాయాలైన విషయాన్ని గుర్తించిన అధికారులు దాని ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో.. సమీపంలోని ‘స్నేక్ హెల్ప్‌లైన్’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను సంప్రదించారు.
స్నేక్ హెల్ప్‌లైన్ ప్రతినిధులు భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి వెంటనే ఆ భారీ సర్పాన్ని అక్కడికి తరలించారు. కొండ చిలువ అంతర్గత భాగాల్లో అయిన గాయాల గురించి తెలుసుకోవడానికి సీటీ స్కానింగ్ తీయాలని నిర్ణయించారు. దీని కోసం వాళ్లు పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఆసుపత్రి యాజమాన్యాన్ని, వైద్యులకు నచ్చజెప్పి ఒప్పించారు.
తీరా స్కానింగ్ కోసం తీసుకెళ్లిన తర్వాత ఆ కొండ చిలువ ఆందోళనతో అటూ ఇటూ కదులుతుండటంతో వారి ప్రయత్నం మరింత జఠిలమైంది. దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో వాటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి చికిత్స చేస్తారు. భారత్‌లో ఇలాంటి విధానాలు అందుబాటులో లేకపోవడంతో.. వైద్యులు ఆ ధైర్యం చేయలేకపోయారు. చివరికి దానికి కదలకుండా ప్లాస్టిక్ టేపులు వేసి స్కానింగ్ తంతు ముగించారు. ఆ పైథాన్ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అది గాయాలపాలవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.