బాలుడిని లైంగికంగా వేధించిన మహిళపై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాలోని మపూసా పట్టణంలో ఈ ఘటన వెలుగుచూసింది. పోండా ప్రాంతానికి చెందిన ఓ బాలుడు(17) మపూసా పట్టణంలోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటూ స్థానికంగా పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల తన సొంతింటికి వెళ్లిన అతడు కుటుంబ సభ్యలతో వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు బాలుడిని సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. కౌన్సిలింగ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కిరాయి ఇంటి యజమానురాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అతడిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడైంది. భర్త నుంచి విడిపోయిన సదరు మహిళ(29) తన ముగ్గురు పిల్లలతో ఆ ఇంట్లో ఉంటోందని తేలింది. ఇది తెలిసిన బాధితుడి తల్లిదండ్రులు మపూసా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సదరు మహిళపై గోవా చిల‍్డ్రన్స్ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే ఆమెను పిలిపించి విచారణ చేపడతామని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ తుషార్ లోట్లికర్ తెలిపారు.