తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సింగరేణి బెల్లంపల్లి రీజియన్ మైనింగ్ స్టాఫ్ మద్ధతు ప్రకటించింది. బుధవారం ఆ రీజియన్ నాయకులు హైదరాబాద్‌లో టిబిజికెఎస్ గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితను కలిసి మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఎంపి కవిత దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందజేశారు.
అనారోగ్యం వల్ల అండర్ గ్రౌండ్ అన్‌ఫిట్ అయితే సర్వీస్‌లో సుటేబుల్ ఉద్యోగం ఇస్తూ వేజ్ ప్రొటెక్షన్ కల్పించాలని మైనింగ్ స్టాఫ్ కోరారు. బెల్లంపల్లి రీజియన్‌లో అమలులో ఉన్న లాకౌట్‌ను ఎత్తివేయాలని, ఎ-గ్రేడ్ మైనింగ్ సర్దార్ లకు సూపర్‌వైజర్ బాధ్యతలు అప్పగిస్తూ బి -గ్రేడ్ సర్దార్‌లకు షాట్ ఫైరర్ విధులను అప్పగించాలని కోరారు. ట్రైనీ జూనియర్ మైనింగ్ ఇంజనీర్ లకు ప్రస్తుతం 5 ఏళ్ల సర్వీసు ఉంటేనే ఓవర్‌మెన్‌లు ప్రమోషన్ ఇస్తున్నారని, గతంలో 2 ఏళ్ల సర్వీసు ఉంటే సరిపోయేదని, పాత విధానాన్ని కొనసాగించేలా చూడాలని కవితను కోరారు.
మైనింగ్ స్టాఫ్‌కు గౌరవం కల్పిస్తాం – ఎంపి కవిత
ఓవర్‌మెన్, సర్దార్, షాట్‌ఫైరర్ విధులు నిర్వహించే సింగరేణి మైనింగ్ స్టాఫ్‌కు తగిన గౌరవం లభించేలా చూస్తామని టిబిజికెఎస్ గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత హామీనిచ్చారు. కార్మికుల సంక్షేమానికి పాటుపడుతున్న టిబిజికెస్‌కు మద్ధతు తెలపడం పట్ల మైనింగ్ స్టాఫ్‌ను ఆమె అభినందించారు. టిబిజికెఎస్‌ను గెలిపించాలని కవిత మైనింగ్ స్టాఫ్ బెల్లంపల్లి రీజియన్ నేతలను కోరారు. ఎంపి కవితను కలిసిన వారిలో జనగామ తిరుపతి, పెండ్రి రాజిరెడ్డి, పశువుల గురుమూర్తి, ఆసం శంకర్, ఎన్. సదయ్య, జె. మురళి, పి.శ్రావణ్, టి. చంద్రశేఖర్, టి. సత్యనారాయణ, వి. సురేశ్, ఎండి. షకీల్ ఎం. రాఘవ్, కృష్టాచారి ఉన్నారు.