ఏపీలో జరిగిన ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు అధికారులు,మహిళలు, విద్య సంఘాలు. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ చదువుతున్న అమ్మాయి తనతో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ దారుణ సంఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.
మీడియాతో ఆమె మాట్లాడుతూ, ‘ఒక వీధి కుక్కల్లాగా, ఊర కుక్కల్లాగా, వేట కుక్కల్లాగా ఆమెపై పడి ఆ విధంగా చేయడం దారుణం.. ముగ్గురు మగోళ్లు కలిసి ఈ దృశ్యాలను వీడియో తీయడమేంటి! ఆ అమ్మాయిపై బలాత్కారం చేయడమేంటి! ఆమె బట్టలను చించేయడమేంటి! ఎటుపోతున్నాం మనం, ఏమవుతున్నాం! క్రూర మృగాల్లాగా, మానవత్వం నశించే విధంగా, నీచాతి నీచమైన ఈ సంఘటనతో సభ్యసమాజం సిగ్గుపడే విధంగా ఉంది.
నాకు చాలా బాధగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటి వాళ్లను ఎలా దారిలో పెట్టాలి? ఇలాంటి వాళ్లకు కఠిన శిక్ష వేయాల్సిఉంది. బెయిల్ కూడా ఇవ్వకూడదు. ఈ కేసులను లాయర్స్ కూడా వాదించకూడదు, వకాల్తా పుచ్చుకోకూడదు. చట్టం కూడా చాలా పకడ్బందీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిర్భయ చట్టం ఉన్నా ఇటువంటి వాళ్లు భయపడటం లేదు.