ఏపీ విశాఖపట్నం అరకు ఎంపీ కొత్త పల్లి గీత తనకు టీడీపీతో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తుందని కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని హక్కుల కమిటీ ముందు పెడతానని కూడా గీత హెచ్చరించారు. తాను రంపచోడవరం ఐటీడీఏ సమావేశాలకు కూడా హాజరుకాబోనని ప్రకటించారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన సలహామండలిని ఏర్పాటు చేశారు. అందులో అరకు ఎంపీ గీతకు స్థానం కల్పించలేదు. మొత్తం 20 మందితో సలహా మండలిని ఏర్పాటు చేస్తే అందులో తనకు చోటు లేకపోవడంపై గీత మండిపడుతున్నారు.
అంతేకాకుండా తనకు పార్టీ అధినేత పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా గీత చెబుతున్నారు. అయితే అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఇప్పటి వరకూ కొంత సంయమనమే పాటించారు. హైకోర్టులో గీత ఎస్టీ కాదంటూ వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉండటమే ఇందుకు కారణం. గీత ఎస్టీ కాదని ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి హైకోర్టులో పిటీషన్ వేశారు. దీన్ని కొట్టేయాలంటూ గీత దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో కొట్టేసింది. 2014 ఎన్నికల్లో అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి ఆమె ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీడీపీ లోకి జంప్ అయిన గీత మళ్ళీ ప్లేటు మార్చడంతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.