తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి మోక్షం లభించింది.ఈ నెల దసరా పండుగ తర్వాత ఫ్లై ఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, జూబ్లీహిల్స్ రోడ్ నం-45, ఫిల్మ్‌నగర్, అగ్రసేన్ సర్కిల్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, తదితర జంక్షన్లలో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, గ్రేడ్ సెపరేటర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా, గ్రీన్ ట్రిబ్యునల్‌లో వ్యాజ్యం వల్ల ఇప్పటివరకు పనులు చేపట్టలేదు. ఇప్పుడు అడ్డంకులన్నీ క్రమంగా తొలిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు జంక్షన్లలో నిర్మాణ పనులకు దసరా పండుగ తర్వాత శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇటీవల ఉన్నతాధికారులతో వేర్వేరుగా నిర్వహించిన సమీక్ష సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్లలో మల్టీలెవల్ ఫ్లై ఓవర్లను నిర్మించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్, జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్, జూబ్లీహిల్స్ రోడ్ నం-45 జంక్షన్లలో సింగిల్ లెవల్ ఫ్లైఓవర్‌ను నిర్మించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. అనంతరం వీటిని మల్టీలెవల్‌గా విస్తంచనున్నారు. రెండో దశలో మరో మూడు జంక్షన్లలో ఫ్లైఓవర్లు నిర్మిస్తారు.మొదటి దశ ఫ్లై ఓవర్ల నిర్మాణంతో నాగార్జున సర్కిల్ -ఇనార్బిట్ మాల్ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని అధికారులు చెప్తున్నారు. నిర్మాణ పనులకు అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు.