విద్యార్థి నాయకుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఉద్యమకారులకు, గాంధేయవాదిగా, తెలంగాణ సాయుధపోరాట మద్దతుదారుడిగా, నైజాం విముక్తి పోరాటకారుడిగా, రాష్ట్ర మంత్రిగా, తెలంగాణ పోరాట యోధుడిగా, బడుగు బలహీన వర్గాల నాయకుడు.. వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇవాళ ఆయన 102వ జయంతి.
అదిలాబాద్ జిల్లా ప్రస్తుత ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లాలోని వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న పద్మశాలి కుటుంబంలో జన్మించారు. 1938లో స్టేట్ కాంగ్రెస్ ఇచ్చిన సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు పాలయ్యారు. 1940 నుండి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారి తరపున న్యాయవాదిగా వాదించడం మొదలుపెట్టి ఉద్యమకారుల్నికాపాడారు. తెలంగాణ వీరనారి చిట్యాల అయిలమ్మ, షేక్ బందగీల తరపున వాదించింది కొండా లక్ష్మణ్ బాపూజీనే. అటు స్వాతంత్ర్యోద్యమంలో, నిజాం వ్యతిరేకఉద్యమంలోనూ సమాంతరంగా పాల్గొన్నారు. 1947 డిసెంబర్ 4, నిజాం నవాబుపై బాంబు దాడి కేసులో నారాయణరావు పవార్ బృందంలో నిందితుడిగా మహారాష్ట్రలో కొంత కాలం అజ్ఞాత జీవితం గడిపిన సమయంలో డాక్టర్ శకుంతలా దేవితో వివాహం జరిగింది. నైజాం రాజ్యం ఇండియన్ యూనియన్‌లో కలవడంతో బాపూజీ తిరిగి తెలాంగాణకు వచ్చారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా 1952లో మొదటి సారిగా ఎన్నికైన కొండా లక్ష్మణ్ బాపూజీ రెండు సార్లు మంత్రిగా..ఒక సారి డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించారు. 15 ఏళ్ల పాటు శాసన సభ్యుడిగా సేవలందించారు.
బాపూజీ తన జీవితంలో SC,ST,BC, మైనార్టీల సఖ్యత కోసం పనిచేశారు. 1941లో మంచిర్యాలలో కిసాన్ సదస్సు ఏర్పాటు చేసి జయప్రకాష్ నారాయణ ఎన్.జి. రంగా లాంటి జాతీయ నాయకులని పిలిచారు. అయితే. ప్రభుత్వం ఆ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. 1950లో హైదరాబాద్ హ్యాండ్లూమ్ వీవర్స్ సెంట్రల్ కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి … రాష్ట్ర చేనేత సహకార రంగానికి కృషిచేశారు. 1951లో బొజ్జం నరసింహం అధ్యక్షుడిగా, కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్ రాష్ట్ర వెనకబడిన తరగతుల సంఘం ఏర్పడింది. ఈ సంఘం చేసిన కృషి కారణంగా హైదరాబాద్‌లో బూర్గుల రామకృష్ణారావు సీఎం ఉన్నప్పుడు కాకా కాలేల్కర్ కమిటీ వచ్చినప్పుడు నిజాం కాలంలో చేసిన జనాభా లెక్కల ప్రకారం బీసీల వివరాలని బొజ్జం నరసింహం గారి నాయకత్వంలో కమిటీకి అందచేయడం జరిగింది. ఫిబ్రవరి 2, 1972 న హైదరాబాద్‌లో బీసీల మహార్యాలీ జరిగింది బాపూజీ నాయకత్వంలో. ఈ సమావేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ మాట్లాడారు. మేరు, విశ్వకర్మ, పద్మశాలి మహాసభలు నిర్వహించారు. 1977లో ఎమర్జెన్సీ తర్వాత బాబు జగ్జీవన్ రామ్‌ని ప్రధాని చేయడం కోసం మద్దతు కూడగట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని ఒకే గొడుగు కిందకి తెచ్చేందుకు విజయవాడలో మరో సమావేశం నిర్వహించారు బాపూజీ.
తెలంగాణ గడ్డ కోసం తన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, పదవులని కోల్పోయి తనకంటూ ఏమీ మిగుల్చుకోని బాపూజీ తన ఆస్తిలో 1/3 వంతు ట్రస్ట్‌కి ఇచ్చేసి 97 సంవత్సరాల వయసులో హైదరాబాద్ మరణించాడు. ఆయన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది.