తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారమవుతోంది.ఖమ్మం జిల్లాలో దమ్మపేట మండలంలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నారు. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామమైన గండుగులపల్లిలో 20, అంకంపాలెంలో 20 చొప్పున మొత్తం 40 ఇళ్లను అర్హులైన పేదలకు అందజేశారు.
తాజాగా మండల పరిధి లింగాలపల్లిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల ను మంత్రి తుమ్మల ప్రారంభించారు . సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు మండలంలోని మందలపల్లి, అల్లిపల్లి గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. వాటిని కూడా త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధం చేస్తామని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడం మరో విశేషం.