ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా స్టేట్‌మెంట్‌తో ఇప్పటికే ఖంగుతిన్న టీడీపీకి మరో షాక్ తగలనుందని సమాచారం. జేసీ దివాకర్ రెడ్డి తరహాలోనే మిగిలిన నేతలు కూడా అధిష్టానంపై వత్తిడి తెచ్చేందుకు రాజీనామా అస్త్రాలను ఉపయోగించనున్నారని తెలుస్తోంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన రాజీనామా అస్త్రంతో ఏకంగా చాగల్లు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఏలూరు ఎంపీ మాగంటి బాబు కూడా ఇదే బాటలో నడవనున్నారని సమాచారం. జేసీ వత్తిడికి తలొగ్గిన అధిష్టానాన్ని అదే రీతిలో తాము కూడా దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు.
ఇక పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు రాజీనామా చేయకపోయినా ఆయన వర్గీయులు మాత్రం రాజీనామాకు సిద్దమైనట్లు సమాచారం. కొందరు పార్టీకి చెందిన నేతలతో పాటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ ఛైర్మన్లు రాజీనామా చేస్తున్నట్లు అధికార పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారని. మాగంటి బాబు చింతలపూడి వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మన్ పదవికి తన అనుచరుడిని నియమించేందుకు జీవోను తెచ్చుకోగా కూడా తెచ్చుకున్నారు. అదే నియోజకవర్గ ఎమ్మెల్యే పీతల సుజాత ఆజీవోను రద్దు చేయించారు. రెండు వర్గాల మధ్య మూడున్నరేళ్లుగా సాగుతున్న ఈ వివాదం ఇంతవరకూ పరిష్కారం కాలేదు. అలాగే పీతల సుజాతకు మద్దతు పలుకుతున్న కొందరు అధిష్టానం పెద్దలపైనా తమ రాజీనామా అస్త్రం పనిచేస్తుందని పశ్చిమ గోదావరి తెలుగు తమ్ముళ్లు సైతం అభిప్రాయపడుతున్నారు.