ఏపీలో జరగబోయే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం అధికార టీడీపీ భారీ స్కెచ్ వేసింది. రాష్ట్రంలో వున్న కులాలు, మతాలు , ప్రాంతాలవారీగా పక్కాగా స్కెచ్ గీసుకుని ముందుకు పోతుంది. వీరిలో బిసిలు, ఎస్సి, మైనారిటీ, ఓసి కేటగిరీలుగా ఇప్పటికే గుర్తించింది ప్రభుత్వం. 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు మాత్రమే మొక్కుబడిగా వారి ఎకౌంట్స్ లో డబ్బులు వేసినా పూర్తి రుణ మాఫీ కాలేదు. అయితే నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా డ్వాక్రా సంఘాల సభ్యుల ఎంకౌట్స్‌లోకి నాలుగు వేలరూపాయల చొప్పున ఎన్నికల ముందు గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు జనం సొమ్మునే సర్కార్ జమేసింది. దీంతో మహిళా ఓటర్లు మునుపెన్నడూ లేనివిధంగా ఉదయాన్నే పోలింగ్ బూత్ లదగ్గర క్యూకట్టారు.
ఇలా రాష్ట్రం అంతా డ్వాక్రా మహిళల ఖాతాల్లో సొమ్ములు వేసిందా అంటే ఏ ఒక్కచోటా వేయలేదు. ఈ బాగోతాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ ఆధారాలతో సహా బట్టబయలు చేశాక ప్రభుత్వం నుంచి రియాక్షన్ లేకుండా పోయింది. కేవలం ఎన్నికలు జరుగుతున్నందునే అక్కడ డ్వాక్రా సభ్యులకు సర్కార్ తాయిలం అందింది అన్నది తేట తెల్లం అయ్యింది. ఎలాగూ గత ఎన్నికలకు ఇచ్చిన వాగ్దానం కావడం దశల వారీ రుణ మాఫీ పేరుతో వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే మంత్రంతో ముందుకు వెళితే పార్టీకి అఖండ విజయం ఖాయమని టీడీపీ భావిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడ్డాక ఇలా ఎవరి ఎకౌంట్లకు వారికి నగదు పంపిణి చేస్తే ఏదైనా నియోజకవర్గంలో ఎన్నికల్లో సక్రమంగా ఓటర్లకు డబ్బు పంపిణి చేపట్టలేకపోయినా ఇతర ఇబ్బందులు తలెత్తినా ధీమాగా గెలవడానికి ఛాన్స్ ఉందని లెక్కలు వేసుకుంటూ భారీ స్కెచ్ వేసింది టీడీపీ సర్కార్.