ఏపీలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బెదిరింపులకు తలొగ్గిన ప్రభుత్వం వెంటనే చాగల్లుకు నీటిని విడుదల చేసింది. అయితే ఈ వివాదం మరింత ముదిరింది. శింగనమల నియోజకవర్గానికి అన్యాయం చేస్తున్నారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన రైతులు రోడ్డెక్కారు. జేసీ రాజీనామా బెదిరింపుకలు భయపడి ఒక ప్రాంతానికి నీటిని ఎలా విడుదల చేస్తారని.. హెచ్చెల్సీ పరిధిలో లేని చాగల్లుకు నీటిని విడుదల చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంత రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఉరుకోబోమని శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే యామిని బాల, ఎమ్మెల్సీ శమంతకమణి హెచ్చరించారు. రైతులకు న్యాయం జరగడం కోసం అవసరమైతే రాజీనామాకు సిద్ధమని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రకంపనలు రేగుతోంది.
