వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు.ఈ రోజు వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామంలో నిర్వహించిన భూరికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కడియం మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉద్ఘాటించారు. రూ. 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామన్న ఆయన.. 36 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో విత్తనాలు, ఎరువులు, కరెంట్ కోసం రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసిన దాఖలాలు లేవు అని గుర్తు చేశారు. రానున్న యాసంగి నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. రైతులు మోటార్లకు ఆటో స్టార్టర్లు తొలగించాలని కోరారు. పెట్టుబడికి రైతులు అప్పులు చేయొద్దనే ఉద్దేశంతోనే.. రైతులకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున రెండు పంటలకు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతాలోనే జమ అవుతాయన్నారు. రైతులకు పెట్టుబడి అందిస్తున్న దేశంలో తొలి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని కడియం స్పష్టం చేశారు