ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నా.. ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో బిజీగా ఉన్నాయి. ఇక వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల గురించి ఆలోచిస్తూనే.. బలమైన పార్లమెంట్ అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది. ఈ క్రమంలో రాయలసీమ నుండి పార్లమెంట్‌కు పోటీ చేసేవాళ్ళ విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాయలసీమలోని ఎనిమిది స్థానాల్లో బలమైన అంగ, ఆర్ధిక బలమున్న వాళ్ళ కోసం చేసిన అన్వేషణ ఫలించినట్టు చెబుతున్నారు. ముందుగా తిరుపతి నుండి ప్రస్తుత ఎంపీ వరప్రసాద్ రావుకి మరోసారి అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. అలాగే చిత్తూరు నుండి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్‌ను బరిలో దించే అవకాశం కనిపిస్తుంది.
ఇక అనంతపురం నుంచి అనంత వెంకట్రామిరెడ్డి బరిలో ఉంటుండగా.. నంద్యాల నుంచి శిల్ప మోహన్ రెడ్డికి అవకాశం దక్కొచ్చని తెలుస్తుంది. నంద్యాల అసెంబ్లీకి చక్రపాణి రెడ్డి పోటీ చెయ్యొచ్చు. హిందూపూర్ నుంచి శ్రీధర్ రెడ్డికి మరోసారి అవకాశం దక్కవచ్చు. రాజంపేటలో మార్పు ఉండకపోవచ్చు. ఇక కీలకమైన కడప నుండి అవినాష్ స్థానంలో వివేకా లేక షర్మిల బరిలో దిగొచ్చు. కర్నూల్ నుంచి ఈ సారి బుట్ట రేణుకకు అవకాశం దక్కకపోవచ్చు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని కర్నూల్ పార్లమెంట్ బరిలో దించాలని జగన్ భావిస్తున్నాడు. ఇది జరగకపోతే డోన్ ఎమ్మెల్యే బుగ్గనని పార్లమెంట్‌కి పంపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో రాజకీయాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి ముందుండే జగన్ ముందుగానే ఎంపీ క్యాండెట్ లను ఫిక్స్ చేసుకొని మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.