ప్రస్తుతం రుణం కోసం వేచిచూస్తున్న వారిని ఆకర్షించేందుకు బ్యాంకులు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా పండగ సీజన్ దృష్టిలో పెట్టుకుని కొత్త పథకాలు తీసుకొస్తున్నాయి. బ్యాంకుల వద్ద నగదు నిల్వలు పెరిగిపోతుండటంతో.. అడిగిన వారికి.. అడగని వారికీ ఏదో ఒక రూపంలో రుణం ఇవ్వాలనే తొందరలో ఉన్నాయి. పెద్దగా హామీలు అక్కర్లేకుండానే కొన్ని గంటల్లోనే రుణాలిచ్చేస్తున్నాయి. తాజాగా ప్రైవేటు రంగ అతిపెద్ద బ్యాంకు ఐసీఐసీఐ ఈ పండగవేళ మరో ఆఫర్‌తో ముందుకు వచ్చింది. గృహరుణం తీసుకునేవారికి క్యాష్‌బ్యాక్ పథకాన్ని ప్రకటించింది. నవంబర్ 30వ తేదీ వరకూ ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
కొత్త పథకం కింద ఐసీఐసీఐ బ్యాంకు గృహరుణం పొందేవారితో పాటు, వేరే బ్యాంకులో ఉన్న రుణాన్ని ఐసీఐసీఐ బ్యాంకుకు బదిలీ చేసుకుంటే 20 శాతం వరకూ లేదా రూ.10వేల క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డును వినియోగించి రూ.30,000 కొనుగోళ్లు జరిపిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30, 2017 వరకూ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
* గృహరుణం పొందిన మూడు నెలల్లోగా క్యాష్‌బ్యాక్‌ను అందుకోవచ్చు.
* ఒక కార్డుకు ఒకసారి మాత్రమే క్యాష్‌బ్యాక్ వస్తుంది.
* పథకం అందుబాటులో ఉన్న సమయంలో గృహరుణం పొందటంతో పాటు, సదరు వినియోగదారుడు క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా రూ.30వేల లావాదేవీ జరపాల్సి ఉంటుంది.
* ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు.. వేతనం పొందే వారిలో మహిళలకు 8.35 శాతం, మిగిలిన వారికి 8.40శాతం వడ్డీకి గృహరుణాలను అందిస్తుండగా, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు 8.50శాతం, ఇతరులకు 8.55శాతం వడ్డీకి రుణాలను మంజూరు చేస్తోంది.
