ఏపీలో సార్వత్రిక ఎన్నికలకి టైం దగ్గర పడడంతో వైసీపీ తన ప్రణాళికల్లో వేగం పెంచింది. ఇప్పటికే నవరత్నాలు, వైఎస్సార్ కుటుంబం లాంటి పథకాలతో ప్రజల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే వైఎస్సార్ కుటుంబంలోకి 38 లక్షల మంది చేరారు. వైఎస్సార్ కుటుంబంలోకి చేరాలన్న పిలుపునకు ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. దీంతో అనేక మంది ముఖ్యనేతలు వైసీపీ వైపే చూస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరిజిల్లాకు చెందిన డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఆకాసం శ్రీరామచంద్రమూర్తి, పశ్చిమ గోదావరి జల్లాకు చెందిన పీవీఎల్ నరసింహరాజు వైసీపీలో చేరారు.
హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వీరిద్దరూ పార్టీ కండువాను కప్పుకున్నారు. రామచంద్రమూర్తి చేరికతో తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఉండినియోజకవర్గానికి చెందిన నరసింహరాజు చేరికతో వెస్ట్ లోనూ పార్టీకి ఊపు వస్తుందని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ ఆళ్లనాని అభిప్రాయపడ్డారు. దీంతో అధికారంలో ఉండి ఇటీవల నంద్యాల, కాకినాడలో గెలిచినా.. టీడీపీ వైపు ఎవరు చూడడంలేదని.. జగన్‌ని ప్రజలకి దూరం చేయాలని ఎన్ని రకాలుగా ట్రై చేసినా.. జగన్ కి ప్రజల్లో ఆదరణ తగ్గడం లేదని.. అలాగూ వైసీపీలో చేరికలు ఇంకా కొనసాగుతున్నాయని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.