తెలంగాణ టీ కాంగ్రెస్ పరిస్థితి మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కిలా ఉంది.మేరునగ పర్వతం లాంటి కేసీఆర్‌ను పడగొట్టే బాహుబలి నేనంటే నేనే అని కుమ్ములాడుకుంటున్న టీకాంగ్రెస్ నాయకులకు త్వరలో కోమటి రెడ్డి బ్రదర్స్ పెద్ద షాక్ ఇవ్వబోవడం ఖాయం అని ప్రస్తుతం టీ కాంగ్రెస్‌లో చోటు చేసుకుంటున్న పరిస్థితులను బట్టి అర్థమవుతుంది.. టీ కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేతకోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డిలు మెల్లగా కాంగ్రెస్‌కు దూరమై బిజేపీకి దగ్గరవుతున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.ఉమ్మడి నల్లొండ జిల్లాలో కోమటి రెడ్డి బ్రదర్స్‌కు, పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పచ్చ గడ్డి వేయకముందే భగ్గుమంటుంది. ఇరు వర్గాల మధ్య విబేధాలు టీ కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి..
ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో అత్యంత శక్తివంతమైన కాంగ్రెస్ నాయకుల్లో జానారెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు వరుసలో ఉంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయంగా, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా శక్తివంతుడు..ఇద్దరు అన్నదమ్ములు రాజకీయంగా, ఆర్థికంగా నల్గొండ జిల్లాలో మెజారిటీ ప్రాంతాన్ని శాసిస్తున్నారు.వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు..వైఎస్ మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి, కోమటిరెడ్డికి పొసగలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ అధిష్టానం తీరుకు నిరసనగా నిరాహార దీక్షలు చేసిన వెంకటరెడ్డి చివరకు తన మంత్రి పదవి కూడా వదులుకున్నారు. ఉద్యమంలో పోరాడిన కాంగ్రెస్ నాయకుడిగా మంచి గుర్తింపు పొందారు. నల్డొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎదురులేదు..ఇంతవరకు ఆయన్ని ఎవరూ ఓడించలేకపోయారు.. గత ఎన్నికల్లో కేసీఆర్ హవాకు ఎదురొడ్డి మరీ కోమటిరెడ్డి గెలిచారు..కానీ భువనగిరి ఎంపీ నుంచి పోటీ చేసిన తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఓడిపోయారు..అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తమ్ముడిని నిలబెట్టి మరీగెలిపించారు. ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంత ప్రయత్నించినా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చెక్ పెట్టలేకపోయారు..
చేస్తూనే ఉన్నారు. అంతే కాదు పదే పదే ఉత్తమ్‌ను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేస్తున్నారు.. పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తున్న సీనియర్లను గౌరవించుకోవాలనే బుద్ధి, ఇంగిత జ్ఞానం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదని , ఉత్తమ్ నాయకత్వంలో వచ్చే ఎన్నికలకు పోతే పార్టీకి ఐదారుసీట్లకు మించి రావని, పొన్నాల లక్ష్మయ్యకంటే ఉత్తమ్ నాయకత్వం అధ్వాన్నం అని కోమటిరెడ్డి మండిపడుతున్నారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వల్ల పార్టీ గత ఎన్నికల్లో నష్టపోయిందని కుంతియా వ్యాఖ్యా నించారని, కిరణ్‌కుమార్‌రెడ్డికి సన్నిహితుడైన ఉత్తమ్‌ను చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఓట్లేస్తారా అంటూ కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నాడు.. తమలాంటి సీనియర్లను పార్టీ నుంచి పంపిస్తే ముఖ్యమంత్రి అవుతాననే భ్రమలో ఉత్తమ్ ఉన్నారంటూ, జీహెచ్‌ఎంసీ, రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోవడానికి ఉత్తమ్ అసమర్థతే కారణమంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఇలా పదే పదే ఉత్తమ్‌ను టార్గెట్ చేసి పీసీసీ పీఠం నుంచి దించివేసి..పీసీసీని తమ అధీనంలోకి తెచ్చుకోవాలన్నదే కోమటి రెడ్డి బ్రదర్స్ వ్యూహం.
కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడే తదుపరి ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థిగా నిలబడడం సంప్రదాయంగా వస్తుంది..అందుకే వచ్చే ఎన్నికల్లో అదృష్టవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను సీఎం కావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావిస్తున్నాడు..తన అన్నను సీఎంగా చేయడానికి తగిన ఆర్థిక అండదండలు ఇవ్వడానికి సోదరుడు రాజగోపాల్ రెడ్డి సిద్దంగా ఉన్నాడు..అసలు పీసీసీ పదవి తమకు ఇస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవడానికి రూ. 1000 కోట్లు ఖర్చుపెట్టడానికి రెడీగా ఉన్నామంటూ కాంగ్రెస్ అధిష్టానానికి కోమటిరెడ్డి బ్రదర్స్ సంకేతాలు కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఉత్తమ్ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలకు వెళతామని తమ ప్రతినిధి కుంతియాతో చెప్పిస్తున్నారు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తమకు విధేయత ప్రదర్శించేవారినే ఆదరిస్తుంది. విధేయత చూపించకపోతే ఎంతటి వారిని అయినా తొక్కేయడానికి సోనియాగాంధీ వెనుకాడదు..వైఎస్ మరణం తర్వాత సోనియా చెప్పినట్లు నడుచుకుంటే జగన్ సీఎం అయ్యేవాడని కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికీ చెబుతుంటారు..తనను విధేయత చూపనందుకే సోనియాగాంధీ జగన్‌ను జైలుకు పంపించిందని కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెబుతుంటారు..
ఇక తెలంగాణ విషయానికి వస్తే సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీర విధేయుడు. గాంధీ ఫ్యామిలీ పట్ల చూపించే లాయల్టీకి పొంగిపోయిన సోనియమ్మ, రాహుల్ గాంధీలు కాంగ్రెస్‌లో అసలే మాత్రం వాగ్ధాటి, ఛరిష్మా లేని ఉత్తమ్‌కు పీసీసీ పీఠం కట్టబెట్టింది. ఇంకో విషయం ఏమిటంటూ దూకుడుగా వ్యవహరిస్తూ , స్వతంత్ర్యంగా వ్యవహరించే కోమటిరెడ్డి లాంటి నాయకులను సోనియమ్మ పెద్దగా ఇష్టపడదు. పార్టీలోనే ఉంటూ తమకు విధేయత చూపిస్తూ, తమ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకునే ఉత్తమ్ లాంటి నాయకులకే సోనియమ్మ పట్టం కడుతుంది. టీ కాంగ్రెస్‌లో తమకు సీఎం అయ్యే అవకాశాలు లేవని భావించిన కోమటిరెడ్డి ఇక పార్టీ నుంచి వెళ్లిపోవాలనే ఉద్దేశంతోనే పదే పదే ఉత్తమ్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పరువు బజారున పడేస్తున్నాడని పార్టీలో చర్చ జరుగుతోంది.
గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ బిజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఆపరేషన్ తెలంగాణలో భాగంగా మోదీ, అమిత్‌షా గ్యాంగ్ తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకులకు గాలం వేస్తుంది . అయితే టీఆర్ఎస్ నుంచి ఎవరూ రావడానికి ఆసక్తి చూపకపోవడంతో కాంగ్రెస్, టీడీపీలోని రెడ్డి సామాజికవర్గ నాయకులపై ఫోకస్ పెట్టింది..టీటీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కూడా బిజేపీలోకి రమ్మని ఆహ్వానం పంపించింది..అయితే రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తుతానికి ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నాడు..రేపోమాపో బిజేపీలో చేరినా ఆశ్యర్యం లేదు..అలాగే తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్నాన్మాయంగా కాంగ్రెస్ మాత్రమే కనిపిస్తోంది..బిజేపీ ఎంతగా ప్రయత్నించినా ప్రత్యాన్మయ శక్తి కాలేకపోతుంది. అందుకే కోమటిరెడ్డి లాంటి సీనియర్ నాయకులను పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తుంది.ఈ 16 వ తేదీన రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌కు వస్తున్నాడని, ఆ సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయన సమక్షంలో బిజేపీలో చేరుతున్నట్లు టీ కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. నిజానికి టీ కాంగ్రెస్‌లో ఉత్తమ్ వర్గం కూడా కోరుకుంటున్నది అదే…కోమటిరెడ్డి బ్రదర్స్‌ను వదిలించుకోవడమే బెటర్ అంటూ ఉత్తమ్ బ్యాచ్ భావిస్తుంది..కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ను కూల్చివేయగల శక్తివంతులు కోమటిరెడ్డి బ్రదర్స్ అని అటు కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇటు ఉత్తమ్ వర్గం కానీ ఊహించడం లేదు..మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్‌లో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు లేదని భావిస్తున్నట్లు సమాచారం..వచ్చే ఎన్నికల్లో కూడా కేంద్రంలో మోదీ సర్కారే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి..తాము కాంగ్రెస్ ను నమ్ముకోవడం కంటే బిజేపీలో చేరడమే బెటరని భావిస్తున్నారని తెలుస్తోంది..మొత్తానికి టీ కాంగ్రెస్ కుంపటిలో కోమటిరెడ్డి బ్రదర్స్ పెట్టిన చిచ్చు ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో బుగ్గిపాల్జేయడం ఖాయమని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.