తెలంగాణ లో రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తోన్న సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఉపరితల గనుల్లో సింగరేణి ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యాయపరమైన చిక్కులు, ఇతర సమస్యలను పరిష్కరించి వారసత్వంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత సాధారణ ఎన్నికలలో హామీనిచ్చిన విధంగా సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాల కానుకను అందించామన్నారు. ఒకరు కోర్టును ఆశ్రయించడం మూలంగా సమస్య ఉత్పన్నమైందన్నారు. సింగరేణి కార్మికులకు నష్టం జరగకుండా వారసత్వ ఉద్యోగం ప్రకటన వెలువడుతుందన్నారు.
సింగరేణిలో నూతన బొగ్గు గనులు, కొత్త కొలువులు ఇతర అంశాలను ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పరిష్కరిస్తోందన్నారు. కార్మికులకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. సింగరేణి కార్మికులు మరోసారి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంను గెలిపించి సింగరేణి అభివృద్ధి, కార్మిక ప్రయోజనం కోసం పాటుపడాలన్నారు. అనంతరం ఎమ్మ్లెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మణుగూరు ఏరియాలో సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ మద్దతుతో తెబొగకాసం గెలుపు ఖాయమైందన్నారు. భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరారు.