నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అహర్నిశలు శ్రమించి, క్రియాశీలకంగా వ్యవహరించిన వారికి నామినేటెడ్ పదవుల్లో సముచితస్థానం ఇస్తామని, వారెవరూ అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. భద్రాది -కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ వేదికగా నిన్న సోమవారం సాయంత్రం జిల్లా గ్రంథాలయ పాలక మండలి ప్రమాణస్వీకారం చేసింది. ఛైర్మన్‌గా దిండిగల రాజేందర్, ఐదుగురు డైరెక్టర్ల ప్రమాణస్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన మహమూద్ అలీ మాట్లాడారు. జిల్లాతో తనకు దశాబ్దాల కిందట నుంచి మంచి అనుబంధం ఉందని, ఉద్యమ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన మద్దతు మరచిపోలేదన్నారు. గతంతో పోల్చుకుంటే ఉభయ జిల్లాల్లో తెరాస బలోపేతమైందనిన్నారు. దిండిగల రాజేందర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ “సభకు వచ్చిన కార్యకర్తలు సింగరేణి ఎన్నికల్లో తెబొగకాసం గెలుపునకు తమ వంతు కృషి చేయాలని రహదారులు, భవనాలశాఖ మంత్రి తుమ్మల కోరారు.
వేలాది మంది పోరాటాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకునే దిశగా అందరం సమష్టిగా శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజానీక అవసరాలను తెలుసుకొని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఇప్పటికే సీతారామతోపాటు పలు ప్రాజెక్టులను విజయవంతంగా ప్రారంభించుకున్నామని, పెండింగ్‌లో ఉన్న జల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. జాతీయ రహదారులన్నీ కొత్తగూడెం మీదుగా భద్రాచలం వెళ్లేలా సాధించుకున్నామని, భద్రాద్రి రామాలయాన్ని యాదాద్రి మాదిరిగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. భద్రాద్రి పవర్‌ప్లాంట్ వచ్చే ఏడాదికి పూర్తవుతుందన్నారు.