అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించి నేటితో ఎనిమిది ఏండ్లు అవుతుంది .మహానేత వైఎస్ వర్ధంతిని పురష్కరించుకొని ఏపీ వ్యాప్తంగా ఆయన అభిమానులు ,వైసీపీ శ్రేణులు వైఎస్సార్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు .ఈ క్రమంలో సినీ రాజకీయ పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన గురించి మాట్లాడుతూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు .మహానేత వైఎస్ గురించి వారి మాటల్లో ..మహానేత దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గురించి ఎవరు ఏమన్నారు అంటే ..?
ప్రజాశ్రేయస్సు కోసం అహరహం పాటుపడి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన గొప్పనేత వైఎస్. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆయన సహకారం, ఆలోచనలపై ఆధారపడేవాడిని. ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నేత. రాష్ట్ర అభివృద్ధి కోసం తపించేవారు. పేదల కోసం వైఎస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు భవిష్యత్తులో కూడా నేతలందరికీ స్ఫూర్తినిస్తాయి. తన రాజకీయ జీవితంలో చేపట్టిన ప్రతి పదవికీ వన్నె తెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను రెండుసార్లు గెలిపించిన ఘనత ఆయనదే.
– మన్మోహన్‌సింగ్, మాజీ ప్రధానమంత్రి
పేదల నాయకుడు
ప్రజాకర్షణగలిగిన పేదల నాయకుడు వైఎస్. తన తుది శ్వాస వరకూ పేదలు, అట్టడుగు వర్గాల వారి కోసం పోరాడిన నేత. అంకిత భావంతో కృషి చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు.
– మీరా కుమార్, లోక్‌సభ మాజీ స్పీకర్
సంక్షేమంతో అందరికీ చేరువయ్యారు..
వైఎస్ రాజశేఖరరెడ్డి నేడు రాజకీయాల్లో ఉన్న అనేకమంది నాయకులకు ఆదర్శప్రాయుడు. చక్కటి పరిపాలనా జ్ఞానం, కార్యాచరణ సామర్థ్యం ఆయన సొంతం. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసిన అనేకానేక పథకాలు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి. నిరుపేదలకు సాయంచేసే విషయంలో తానే అన్నీ అనే రీతిలో ముందుంటారు. పేద రైతులు, చేనేత కార్మికులు, కార్మిక వర్గాలు సహా అన్ని వర్గాల అభ్యున్నతికి పథకాలు రూపొందించి అమలు చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యారు.
– ఎం. కరుణానిధి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి
మాటకు కట్టుబడి ఉండే మంచి మనిషి
నిర్ణయాలు తీసుకోవడంలో తనకు తానే సాటి. రాజకీయాలలో ఎందరో నేతలుంటారు కానీ వైఎస్‌ది విలక్షణ శైలి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మనిషి. తన వద్దకు సాయం కోసం వచ్చిన వ్యక్తిది ఏ వర్గం, ఏ పార్టీ, ఏ ప్రాంతం అని ఆలోచించకుండా ఓకే ఓకే… అనడం ఆయన తత్వం. ఆయన స్మృతి ప్రజల హృదయాలలో ఎల్లకాలం నిలిచిపోతుంది.
– రోశయ్య, మాజీ ముఖ్యమంత్రి
జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన నాయకుడు
పాతికేళ్ల రాజకీయ జీవితం మొత్తాన్ని ప్రజలకే అంకితం చేసిన గొప్ప నాయకుడు వైఎస్. ముఖ్యమంత్రిగా ఆరేళ్లలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు.
–ఎల్‌కే అద్వానీ, బీజేపీ అగ్రనేత
అందరికీ ఆమోదయోగ్య పాలకుడు
మైనారిటీలకు ఎంతో సేవ చేసిన నాయకుడు. మాట నిలబెట్టుకునే మనిషి. ఆవేశం, ప్రణాళికతో కూడిన వ్యూహాత్మక నాయకుడు. ముస్లింల పేదరికం పట్ల ఆయన చాలా ఆందోళన కనబరిచేవారు. విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించారు. పాతబస్తీ అభివృద్ధికి రెండువేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. అందులో ఆరేడువందల కోట్లు మురుగు నీటి సమస్య పరిష్కారానికి ఇచ్చారు.
– అసదుద్దీన్ ఒవైసీ, పార్లమెంటు సభ్యుడు