తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనకు రైతులందరూ సహకరించాలని గవర్నర్ నరసింహన్ కోరారు. జిల్లాలోని నాగసాలలో నిర్వహించిన భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. భూరికార్డుల ప్రక్షాళనను గవర్నర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నరసింహన్ మాట్లాడారు.
ఆ తర్వాత భూ సమగ్ర సర్వేను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రంలో భూరికార్డులపై సమగ్ర ప్రక్షాళన పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకే ఈ కార్యక్రమం అన్ని అన్నారు. భూ సమగ్ర సర్వే విషయంలో రైతులకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొనే.. సీఎం కేసీఆర్ భూరికార్డులపై సర్వే చేయిస్తున్నారని తెలిపారు. ఈ సర్వే ద్వారా ఎవరికీ ఎంత భూమి ఉందో తెలుస్తుందన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సర్వే చేస్తున్నారు.
రైతుల ముఖాల్లో సంతోషం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. భూముల కొనుగోలు, అమ్మకాల విషయంలో ఇప్పుడు మీరు పడే కష్టాలు.. భవిష్యత్‌లో మీ పిల్లలు పడొద్దు.. వారు కూడా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రావొద్దు.. అందుకే భూరికార్డులపై సమగ్ర ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ ప్రక్షాళన అనంతరం.. గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి.. ఎవరికీ ఎంత భూమి ఉంది.. ఏ సర్వే నెంబర్లో ఉందో.. ఊర్లోని నోటీసు బోర్డులో ప్రకటిస్తారు. ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులకు రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, మంత్రి లకా్ష్మరెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్‌తో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు