రిలయెన్స్ జియో దెబ్బకు ఒక్కో టెలికాం ఆపరేటర్ దిగొస్తోంది. తమ వినియోగదారులు జారిపోకుండా చూసుకునేందుకు టెలికాం కంపెనీలు రోజుకో ఆఫర్ ను ప్రవేశపెడుతున్నాయి.ఇప్పటికే వొడాఫోన్, ఎయిర్‌టెల్ పలు ఆఫర్లతో ఆకర్షిస్తుండగా.. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఓ సూపర్ ఆఫర్ ప్రకటించింది. తమ వినియోగదారులను నిలబెట్టుకోవడంతో పాటు, కొత్త వారిని ఆకర్షించడానికి దేశీయ టెలికాం సంస్థలు తీవ్ర పోటీ పడుతున్నాయి. దీంతో భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా అదే బాటలో పయనిస్తోంది. తన వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.429తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 90 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవడంతో పాటు, రోజూ 1జీబీ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. ‘రూ.429కే అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1జీబీ డేటా పథకాన్ని అందిస్తున్నాం. అంటే నెలకు రూ.143 మాత్రమే ఖర్చు అవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పథకాల్లో ఇది ఉత్తమమైనది’ అని బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు డైరెక్టర్ ఆర్.కె. మిత్తల్ తెలిపారు.
