తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగక్కి కానుకగా ఇవ్వాలని తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదటి ప్రయత్నం కాబట్టి కొన్ని లోపాలుంటాయి. వచ్చే పండుక్కి ఈ లోపాలు లేకుండా చూసుకొని ఎక్కువ సమయమిస్తే పూర్తి స్థాయిలో సిరిసిల్లలోనే నాణ్యమైన చీరలు తయారుచేసే అవకాశం ఉన్నది. అంతటి నైపుణ్యం కూడా నేతన్నలకున్నది. కాని భయపెట్టి బద్నాం చేసి ఇన్నాళ్లకు ఒక మంచి పాలసీ వస్తే దానిని మరుగునపరిచే ప్రయత్నం చేయడం పద్ధతి కాదు. మరణశయ్య మీదున్న సిరిసిల్ల మరమగ్గాన్ని ఈసారి బతుకమ్మ బతికించింది. తిండి, కరువు, బతుకు, బరువుతో చేజారిన చేనేత జీవితాన్ని చీర చేరదీసింది. ఆగమైన మగ్గం బతుకులకు ప్రభుత్వం ఊతమిస్తే ఈ సా రి నేతన్న మెరుగైన జీతమెత్తాడు. 14 సైజింగ్ యూనిట్లకు 70 డైయింగ్ యూనిట్లకు 42 వేల మరమగ్గాలకు 322 అనుబంధ కుటీర పరిశ్రమల కు పని కల్పించి, 52 మాక్స్ సంఘాలను 16 వేల మంది కార్మికులను 2 వేలమంది ఆసాములను 4 వేల మంది అనుబంధ కార్మికులను సంతోషంలో ముంచెత్తుతూ 65 లక్షల చీరలతో ఈసారి బతుకమ్మ సిరిసిల్ల చీరను కట్టబోతున్నది.
అయితే దీనిపై కొందరు రాజకీయం చేయడం కొం దరి బతుకులను ఆగంచేసినట్టే అవుతుంది. ఇన్నాళ్లకు స్వరాష్ట్రంలో వారి బతుకులకు ఒక భరోసా దొరుకుతుంటే నోటిముందు కూటిని కాకుండా చేయడం పద్ధతి కాదు. ఒక పాలసీ మొదలుపెట్టినప్పుడు కొన్ని లోపాలు సహజమే. పెద్దమనసు తో వాటిని సరిదిద్దే పనిచేయాలి. కానీ సందు దొరికింది కదా అని పాలసీనే చంపే పని చేయడం, చేసిన ప్రతీ పనిలో కూడా తప్పులు వెతుకడం చావు బతుకులతో రాజకీయం చేయడమే. ఇప్పటికే నేతన్నల బతుకు అగ్గి మీద బొర్రిచ్చినట్టుంది. ఒక్కసారి కొం డ కిష్టయ్యను గుర్తుకు చేసుకొండి. పిల్లలకు పిడికెడు తిండి పెట్టలేక అప్పు ల బాధను తట్టుకోలేక పెంచిన చేతులతోనే విషమిచ్చి చంపుకున్నాడు. ఒక్కసారి కోడం దేవేందర్‌ను యాదికి తెచ్చుకోండి. అద్దకానికి తెచ్చిన నైట్రస్ ఆక్సైడ్‌నే అప్పుల బాధకు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక అయిల మధుసూధన్, ఒక బోగ మల్లయ్య, ఒక గాజంగి భాస్కర్‌ల మెడలకు వేలాడిన ఉరితాళ్లను మననం చేసుకోండి. ఎదిగిన పిల్లలు పెరిగిన అప్పు లు కళ్లముందు కదులుతుంటే తట్టుకోలేక కళ్లు మూశారు.
అప్పుడెప్పుడో పాతికేళ్ల కింద అగ్గి పెట్టెలో ఇమిడే చీరను నేసినందుకు నేతన్నకు గిన్నీస్‌బుక్‌లో పేరు తప్ప నోటిలోకి అయిదు వేళ్లు వచ్చింది లేదు. అట్లాంటా ఒలింపిక్స్‌లో అనితర సాధ్యంగా 120 మీటర్ల జాతీయ జెండాను ఎగురవేసినందుకు ప్రపంచ దేశాల ప్రశంసలు తప్ప బతుకడానికి పైసలు రాలేదు. ఒక కుట్టు లేకుండా షర్టు నేసినందుకు ధారాలతోనే నేతల బొమ్మలు గీసినందుకు బ్రాస్‌లైట్ నేసినందుకు పొగడ్తలు తప్ప పొట్ట గడిచింది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో నేతలు నేతన్నల రాత మారుస్తానని కమిటీల మీద కమిటీలు వేశారు. కానీ ఏ కమిటీ లోతుగా అధ్యయనం చేసింది లేదు ఆత్మహత్యలు ఆగింది లేదు. వైఎస్ రాగానే రోశయ్య కమిటీ వేశారు. అది మొక్కుబడిగా కొన్ని ప్యాకేజీలు సూచించి చేతులు దులుపుకున్నది. సురవరం సుధాకర్‌రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు కొంతమంది ఎంపీలు అధ్యయ నం కోసం సిరిసిల్లకు వచ్చారు. అప్పటికప్పుడు ఎన్నో సూచనలు చేశారు. అవి ఆమల్లోకి వచ్చింది లేదు. నేతన్న బతుకు మారింది లేదు. ఐఎస్‌ఎ ల్‌ఎస్ సంస్థ సర్వేచేసి ఆధునిక మరమగ్గాలు ఇవ్వాలని రిపోర్టు ఇస్తే దాని ని అమలుచేసిన దాఖలాలు లెవ్వు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కావూరి సాంబశివరావు మరమగ్గాల ఆధునీకరణ కోసం వేసిన ఒక్క అడుగు తర్వాత కాలంలో ముందుకు సాగింది లేదు.
ఇప్పుడు స్వరాష్ట్రంలో నేతన్న రాత మార్చాలని విద్యుత్ రాయితీలు, నూలుకు రంగులకు, రసాయనాలకు సబ్సిడీలు, వర్క్‌షెడ్ పథకాలు, మాక్స్ సొసైటీల పునరుద్ధరణతో పాటు శాశ్వతంగా ఉపాధి కల్పించడం ఒక్కటే పరిష్కారమని వేసిన మొదటి అడుగులో ఒక భాగమే ఈ బతుక మ్మ చీర. ఇంతకుముందు కేసీఆర్ కిట్లకు చీరలు, ఆర్‌వీఎం ద్వారా బడి పిల్లలకు బట్టలు, కేజీబీవీ ,అంగన్వాడీ, ఆరోగ్య శాఖ ఆర్డర్లతో నేతన్నల మొఖాల మీద చిరునవ్వును చూసిన ప్రభుత్వం బతుకమ్మ చీరలతో ఆ నవ్వును శాశ్వతం చేద్దామని పెద్దమొత్తంలో ఆర్డర్ ఇచ్చింది. జూన్‌లో బతుకమ్మ ఆర్డర్లు, మార్చిలో బడిబట్టలు, అక్టోబర్‌లో క్రిస్‌మస్ బట్టలు ఆర్డర్ల తో ఒక శాశ్వత ఉపాధి కల్పించాలని ఆలోచిస్తుంటే అడ్డుకొని ఆగిపోయేలా చేయ డం మంచిది కాదు. వాస్తవంగా రాష్ట్రం మొత్తానికి ఒక కోటి ఆరు లక్షల చీరలు కావాలి. ఈ మూడు నెలల్లో అన్ని చీరలు సిరిసిల్లలో తయారుచేయడం సాధ్యం కాదు. కాబట్టి అరువై అయిదు లక్షలు ఇక్కడ తయారుచేసి మిగిలినవి సూరత్ నుంచి తెచ్చారు. నిజానికి ప్రజలు చేనేత చీరలు అనుకున్నారు. వాస్తవంగా అందరికి చేనేత చీరలు ఇవ్వాలంటే సాధ్యమయ్యే పనికాదు.
ఎందుకంటే సిరిసిల్లలో చేనేత మగ్గాల సంఖ్య రెండు వందల లోపే. రాష్ట్రవ్యాప్తంగా పది వేలలోపే. వాటి మీద కోటి చీరలు నేయడం మాటలు కాదు. అందుకే పాలిస్టర్ చీరలు అదీ సూరత్ నుంచి తెచ్చినవాటితో కలిపి పంచుతున్నారు. మొదటి ప్రయత్నం కాబట్టి కొన్ని లోపాలుంటాయి. వచ్చే పం డుక్కి ఈ లోపాలు లేకుండా చూసుకొని ఎక్కువ సమయమిస్తే పూర్తి స్థాయిలో సిరిసిల్లలోనే నాణ్యమైన చీరలు తయారుచేసే అవకాశం ఉన్నది. అంతటి నైపుణ్యం కూడా నేతన్నల కున్నది. కాని భయపెట్టి బద్నాం చేసి ఇన్నాళ్లకు ఒక మంచి పాలసీ వస్తే దానిని మరుగునపరిచే ప్రయత్నం చేయడం పద్ధతి కాదు. ఇప్పటికే చీరల మీద నేతల రాజకీయాలను చూసి నేతన్న ఉన్న ఉపాధి పోతుందని భయపడుతున్నాడు. అతడి బతుకుకు భరోసా ఇవ్వడం మన బాధ్యత.
వ్యాసకర్త: Peddinti Ashok Kumar