ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడలో నన్ను ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడంతో పాటు గుడివాడ వదిలి వెళ్ళేందుకు తాను సిద్ధమని దమ్మున్న సవాల్ విసిరారు. దమ్మున్న టీడీపీ నేతలు ఎవరైనా ఉంటే ఈ సవాల్‌ని స్వీకరించాలని కొడాలి నాని అన్నారు. కాగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన నాని వరుసగా ఓడిపోతున్నా రావి వెంకటేశ్వరరావుకు సిగ్గు రావడం లేదని..గుడివాడలో కల్తీ నూనెలు అమ్ముతున్న వ్యక్తి రావి అని అలాంటి వ్యక్తికి తనను విమర్శించే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. వంగవీటి రంగా హత్య సమయంలో జరిగిన అల్లర్లలో 10 లక్షల ఆస్తి నష్టం జరిగితే… ఏకంగా 10కోట్ల నష్టపరిహారం డ్రా చేసిన వ్యక్తి రావి వెంకటేశ్వరరావు అని ఆరోపించారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి గుడివాడ నియోజకవర్గంలో 10వేల మంది యువతతో జగన్ యువసేనను నిర్మిస్తానన్నారు.
