ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారిలో భరోసాను కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. కాగా, జగన్ చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు బాబాయ్, వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇటీవల ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆదిశేషగి మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సూపర్‌స్టార్ కృష్ణ వైసీపీ తరుపున ప్రచారం చేస్తారని స్పష్టం చేశారు. అలాగే, మహేష్‌బాబు కూడా వైసీపీకే మద్దతు ఇస్తారని చెప్పారు. అయితే, సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్‌కు మద్దతు తెలుపుతూ మాట్లాడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. ఈ మాటలనే ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గుర్తు చేశారు. ఆదిశేషగిరిరావు చెప్పిన ఈ మాటలను విన్న వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.