జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డపై పై గులాబీ దళపతి , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల వర్షం కురిపించారు.సీ ఎం కేసీఆర్ ఇవాళ గద్వాల జిల్లాలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గట్టు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేశారు.అనంతరం నడిగడ్డ ప్రగతి సభలో సీఎం ప్రసంగించారు.
గద్వాల ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. గద్వాల అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.
గట్టు ఎత్తిపోతల పథకానికి నల్ల సోమనాద్రి గట్ట ఎత్తిపోతల పథకం అని పేరు పెడతామని … రాష్ట్రంలో కొత్తగా 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని, వాటిలో ఒకటి గట్టులో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేడీ దొడ్డిలో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గుర్రంగడ్డ బ్రిడ్జిని రూ. 8 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తామని చెప్పారు.గద్వాల బస్టాండ్‌కు ముఖ్యమంత్రి నిధి నుంచి రూ. 2 కోట్లు, జూరాల డ్యామ్ సైట్ దగ్గర బృందావనానికి రూ. 15 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
గట్టు ఎత్తిపోతల పూర్తయితే నడిగడ్డలో 1.20లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల తాగునీరందిస్తామన్నారు.
దేశం మొత్తం తెలంగాణ వచ్చి అధ్యయనం చేసేలా అభివృద్ది చేస్తామన్నారు సీఎం కేసీఆర్. రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే డిమాండ్ ఉన్న పంటనే వేయాలన్నారు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేశామన్నారు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నారు. రాష్ట్రాన్ని పంటల కాలనీలుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. బహిరంగ సభకు మంత్రులు హరీశ్ రావు, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.