తెలంగాణ రాష్ట్రం సామాజిక, ఆర్థిక రంగాల్లో సాధిస్తున్న ప్రగతి అద్భుతంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శవంతంగా ఉన్నాయని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విదేశాంగశాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ (Sheikh Abdullah Bin Zayed Al Nahyan) ప్రశంసించారు. గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో వారు సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో యూఏఈ మంత్రి నూతన తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న పాలన, జరుగుతున్న అభివృద్ధి గురించి ఆసక్తితో ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు.
see also:నేడు గద్వాలకి సీఎం కేసీఆర్
ఆర్థిక పరమైన పరిశ్రమల స్థాపనకు సంబంధించి మాత్రమే కాకుండా, తెలంగాణలో సామాజిక రంగం, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ మెరుగు పడుతున్న తీరును తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి నూతన రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని అధిగమిస్తున్న తీరును తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యుత్ రంగంలో నాలుగేళ్ల స్వల్ప వ్యవధిలోనే జరిగిన గుణాత్మక మార్పును తదనుగుణంగా మెరుగుపడుతున్న వ్యవసాయ రంగాభివృద్ధిని వివరాలతో సహా ఆరా తీశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, మైనారిటీ విద్యార్థులకు ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, మైనారిటీల కోసం అమలు పరుస్తున్న పథకాల గురించి తెలుసుకొని అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరును చూడాలని యూఏఈ మంత్రిని ముఖ్యమంత్రి ఆహ్వానించగా, తాను త్వరలో మళ్లీ వస్తానని, అపుడు మూడు నాలుగు రోజులుండైనా, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితోపాటు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తానని షేక్ అబ్ధుల్లా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
see also:మంత్రి పోచారంకు కేటీఆర్, హరీశ్‌రావు పరామర్శ
తెలంగాణలో ప్రపంచ ఆదరణ పొందుతున్న మెడికల్ టూరిజం పట్ల ఆసక్తి కనబరిచారు. అందుకు అనువైన వాతావరణం హైదరాబాద్ లో ఉండటం వైద్యరంగం అభివృద్ధికి దోహదపడుతుందన్న సీఎం మాటలతో ఆయన ఏకీభవించారు. పలు అంశాల పట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్ చేసిన వివరణకు అబ్బురపడ్డారు. రాష్ట్ర విభజన జరిగినపుడు అభివృద్ధి నాలుగేళ్ల అత్యంత తక్కువ సమయంలో గణనీయంగా పెరగడం తెలుసుకొని అభినందించారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే ఎక్కువగా ఉండటం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన యూఏఈ మంత్రి.. ఇది ఈ రాష్ట్ర పాలనా విధానానికి నిదర్శనమని కొనియాడారు.
see also:తెలంగాణలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు..సీఎం కేసీఆర్
తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచారు. హైదరాబాద్ లో యూఏఈ కాన్సులేట్ ఏర్పాటుకు సంబంధించి యూఏఈ విదేశాంగ మంత్రి చూపించిన చొరవకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. అందుకు కావలసినటువంటి స్థలం, మౌలిక సౌకర్యాలను తక్షణమే సమకూర్చాలని అక్కడే ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇది తెలంగాణకు అరబ్ ఎమిరేట్స్ కు నడుమ బంధాన్ని బలోపేతం చేస్తుందని ఇరువురూ విశ్వాసం వ్యక్తం చేశారు.
see also:ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..!!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు – తెలంగాణకు నడుమ ఉన్న సాంస్కృతిక అనుంబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. మధ్య ఆసియాకు హైదరాబాద్ కు కొనసాగుతున్న చారిత్రక, వ్యాపార, సాంస్కృతిక వ్యవహారాలపై, అనుబంధాలపై సీఎం సోదాహరణలతో షేక్ అబ్దుల్లా బృందానికి వివరించారు. తన బృందంతో తెలంగాణలో పర్యటించడం గౌరవంగా భావిస్తున్నానన్న షేక్ అబ్దుల్లా సమావేశం జరిగినంత సేపూ ఉత్సాహంగా కనిపించారు. ముఖ్యమంత్రిని పలు అంశాలను కూలంకశంగా అడిగి తెలుసుకోవడం పట్ల సీఎం సహా, అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశ అనంతరం షేక్ అబ్దుల్లాకు, హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక చిహ్నమైన చార్మినార్ మెమెంటోను బహుకరించి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కె.టీ.రామారావు, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ రావు, వివిధశాఖలకు చెందిన ఉన్నతాధికారులు అరవింద్ కుమార్, రామకృష్ణారావు, జయేశ్ రంజన్, ప్రభుత్వ సలహాదారు ఏకేఖాన్ తదితరులు పాల్గొన్నారు.
see also:స్టేషన్ ఘన్పూర్ ప్రజల రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది..!!