తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలు రైతుబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, హరితహారం, మిషన్ భగీరథ పనులు అనుకున్నసమయంలో పూర్తి చేసే విధంగా అధికారులు పక్కా ప్రణాళికలతో, సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నాలుగు పథకాలపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఐదు జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, ప్రభుత్వ విప్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, జడ్పి చైర్ పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు బండ ప్రకాష్, సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, అరూరి రమేష్, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, వినయ్ భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చైర్మన్లు రాజయ్య యాదవ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, మర్రి యాదవరెడ్డి, సంపత్, లింగంపల్లి కిషన్ రావు, వాసుదేవరెడ్డి, సీసీఎల్ఏ డైరెక్టర్ వాకాటి కరుణ, హౌసింగ్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సిఎంఓ కార్యదర్శి స్మిత సబర్వాల్, కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, అమేయకుమార్, శివలింగయ్య, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గౌతమ్, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
see also:సమన్వయంతో పనిచేద్దాం..!!
సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో ఉమ్మడి వరంగల్ జిల్లా గతంలో ఎప్పుడూ మొదటి, రెండో స్థానాల్లో ఉండేదని, ఇప్పుడు కూడా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల అమలులో అలాగే కొనసాగేలా అధికారులు సమిష్టి కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వినూత్నంగా అమలు చేస్తున్న అనేక పథకాలు నేడు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయన్నారు. అనేక రాష్ట్రాలు ఇక్కడికి వచ్చి వాటిని అధ్యయనం చేస్తున్నాయన్నారు. ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని చూస్తున్నాయని చెప్పారు. ఇంత గొప్ప పథకాలు రాష్ట్రంలో ప్రజలందరికీ అందే విధంగా అధికారులు పనిచేయాలన్నారు. జిల్లాల పునః విభజన వల్ల పరిధి తగ్గి, ప్రజలకు తొందరగా చేరేందుకు అధికారులకు మార్గం సులభం అయ్యిందన్నారు. ఈ నేపథ్యంలో పథకాలను ప్రజల వద్దకు మరింత పకడ్బందీగా తీసుకెళ్లే విధంగా పక్కా ప్రణాళికలు రూపొందించుకుని వాటిని అమలులోకి తీసుకురావాలన్నారు.
see also:మంత్రి కేటీఆర్ పేరుతో కారు నంబర్ ప్లేట్..!!
రైతుబంధు-రైతుబీమా పథకాలు
రైతుబంధు పథకం రూపకల్పన నుంచి నేటి అమలు వరకు మన పూర్వ వరంగల్ జిల్లా కలెక్టర్ గా పనిచేసి ఇప్పుడు సీసీఎల్ఏ డైరెక్టర్ గా పనిచేస్తున్న వాకాటి కరుణ క్రీయాశీలకంగా ఉన్నారన్నారు. రైతు బంధు పథకంలో జిల్లాలకు వచ్చిన చెక్కులు, లబ్ధిదారులకు చేరిన చెక్కులకు మధ్య చాలా గ్యాప్ ఉందన్నారు. ప్రతి రైతుకు చెక్కులు చేరే విధంగా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అదేవిధంగా భూమి పట్టాల విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించి రైతులకు పాస్ బుక్కులు అందించాలన్నారు. మొదట పార్ట్ –ఏ లోని రైతులందరికీ పాస్ బుక్కులు,చెక్కులు అందించాలన్నారు. గతంలో ఎప్పుడూ భూ రికార్డుల ప్రక్షాళన జరగలేదని, ఇప్పుడు ఈ ప్రక్షాళనతో భూమికి సంబంధించిన అనేక సమస్యలు బయటపడుతున్నాయన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అధికారులుండాలని కోరారు. అదేవిధంగా ప్రజా ప్రతినిధులు కూడా అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. రైతు బీమా, రైతు బంధు పథకాల అమలులో వ్యవసాయ విస్తరణ అధికారుల సేవలు వినియోగించుకోవాలన్నారు. గ్రామం, మండలం, జిల్లా యూనిట్ గా రైతు బంధు పథకం అమలులోని సమస్యలు గుర్తించి ,వాటిని పరిష్కరించడంపై దృష్టి పెట్టాలన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాల అమలులో ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి స్థానంలో ఉండేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
see also:టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ..!
హరితహారం
హరితహారం పథకం అమలులో అధికారులు ఎన్ని లక్షల మొక్కలు నాటామని కాకుండా ఎన్ని ఎకరాల్లో మొక్కలు పెట్టామనే దానిపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని హరితహారానికి అనుసంధానం చేసిన ప్రాంతాల్లో ఫలితాలు బాగున్నాయని తెలిపారు. ఇంకా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని హరితహారానికి అనుసంధానించని ప్రాంతాల్లో వెంటనే ఆ పనిచేయాలని కోరారు. ప్రతి ప్రభుత్వ సంస్థలోని ఖాళీ స్థలాల్లో బ్లాక్ ప్లాంటేషన్ చేయాలన్నారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారిగా ప్రభుత్వ, ప్రైవేట్ ఖాళీల స్థలాలను గుర్తించి, సంబంధిత యజమానులతో మాట్లాడి మొక్కలు నాటాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని నివాసాల్లో ఎక్కువగా పండ్లు, పూల మొక్కలు అడుగుతున్నారని, వారి ఇష్టం మేరకు మొక్కలు పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ కోసం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి నెల హరితహారంపై సమీక్ష నిర్వహించి అనుకున్న లక్ష్యాలు పూర్తయ్యేలా పనిచేయాలన్నారు.
see also:మిషన్ భగీరథ, గౌరవెల్లి రిజర్వాయరు పనుల పురోగతి పై మంత్రి హరీశ్ సమీక్ష
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం
ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో డబుల్ బెడ్ రూమ్ పథకం అమలులో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ పథకం కొంత నెమ్మదిగా నడుస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల చొరవ లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం విజయవంతం కాదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు స్థలాలు గుర్తించడంలో, కాంట్రాక్టర్లను ఒప్పించడంలో, పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షణ చేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళ్తేనే ఇళ్ల నిర్మాణ లక్ష్యం పూర్తవుతుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడానికి ప్రభుత్వం కూడా ఇటీవల అనేక సదుపాయాలు, మినహాయింపులు కల్పించిందని హౌజింగ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ తెలిపారు. రాష్ట్రంలో 2,60,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యం పెట్టుకోగా, లక్షా 63 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందన్నారు. ఇందులో 13వేల ఇళ్లను పూర్తి చేశామన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఆన్ లైన్ చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. 18వేల కోట్ల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లనిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చిస్తుంటే…కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికి 23వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని తెలిపారు. సిమెంట్, స్టీల్, ఇసుక విషయంలో కాంట్రాక్టర్లకు ఇబ్బందులు జరగకుండా అనేక మార్పులు తీసుకొచ్చామని వివరించారు. కొత్త, కొత్త సాంకేతిక పరిజ్ణానాన్ని వినియోగిస్తూ, గ్రామాలు, మండలాలు, జిల్లాల వారిగా ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ లక్ష్యం చేరేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాలని ఆమె కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి లేవనెత్తిన అంశాలకు ఆమె సమాధానమిచ్చారు. వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతామని హామీ ఇచ్చారు.
see also:తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..!!
ముఖ్యమంత్రి కేసిఆర్ వరంగల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారని, వాటిని పూర్తి చేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు.
మిషన్ భగీరథ
మిషన్ భగీరథ అధికారులపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆగ్రహం.
see also:వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే..!!
మిషన్ భగీరథ పనుల్లో అధికారుల తీరుపై ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ అధికారుల వద్ద ప్రజా ప్రతినిధుల వద్ద ఉన్న సమాచారం కూడా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓటు అడగమని ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానం ఇది అని, దీని కోసం ఎంతో చిత్తశుద్ధి, , ఎంతో సీరియస్ గా పని చేయాలని కోరారు. కానీ ఆచరణలో అలా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రతిసారి సమావేశానికి వచ్చి ఈలోపు పనులు పూర్త చేస్తామని చెబుతున్నారని, మళ్ళీ వచ్చే సమావేశం నాటికి అవి పూర్తి చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ భగీరథలో అనుకున్నట్టు పనులు కాకపోతే రేపు ప్రజలకు తాము ఏం సమాధానం చెప్పాలని అడిగారు. దయచేసి అధికారులు మిషన్ భగీరథ పనులలో సీరియస్ గా ఉండి లక్ష్యాలు అనుకున్న సమయంలో పూర్తి చేయాలన్నారు.
see also:తెలంగాణ వ్యవసాయ శాఖ పురోగమనంలో మంత్రి పోచారందే కీలకపాత్ర..!!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ సంస్థలకు అనుకున్న సమయంలో నల్లాలు ఏర్పాటు చేసి, నీరు అందించాలన్నారు. అదేవిధంగా 2018 డిసెంబర్ నాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 20వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తవుతాయని, వీటికి కూడా నల్లాల ద్వారా నీరందించేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. రోజువారిగా, గ్రామాల వారిగా ప్రణాళికలు రూపొందించుకుని మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని కోరారు.
ఈ ఏడాది జూలై 15 నాటికి మిషన్ భగీరథ కింద ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం బల్క్ సప్లై పూర్తి కావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి డెడ్ లైన్ విధించారు. 2018 సెప్టెంబర్ 15 నాటికి ఓవర్ హెడ్ రిజర్వాయర్స్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా ట్రయల్ నిర్వహించాలని, ఈ పదిరోజుల్లోనే వచ్చే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అక్టోబర్ 11వ తేదీ కొత్త జిల్లాల ఏర్పాటు దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందాలని చెప్పారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రణాళిక బద్దంగా రూపొందించుకుని పనులు చేయాలన్నారు.
see also:సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయడమే నిజమైన ప్రజాసేవ..మంత్రి హరీష్
ఈ ఏడాది జూలై చివరివారంలో కానీ , ఆగస్టు మొదటి వారంలోగానీ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు లింగంపల్లి రిజర్వాయర్ కు శంకుస్థాపన చేయనున్నారని, ఈ సందర్భంగా జనగామ జిల్లా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరిచ్చే దానిని ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కాబట్టి జనగామ జిల్లాలో ప్రత్యేక శ్రద్ధతో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితసబర్వాల్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులు పూర్తి చేయడంలో అధికారులు గ్రామాలకు వెళ్లి అక్కడున్న గ్యాప్స్ గుర్తించి, వాటిని పరిష్కరించాలన్నారు. ప్రతి ప్రభుత్వ సంస్థలో రక్షిత మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే రూపొందించుకున్నామని, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించినట్లు అన్ని విద్యా సంస్థలు, దవాఖానాలు, ఇతర సంస్థల్లో కూడా రక్షిత మంచినీరు అందించే ప్రణాళికలు అధికారులు రూపొందించుకోవాలన్నారు. నిర్ణీత సమయంలోనే బల్క్ వాటర్ సప్లై పూర్తి చేస్తామని, అదేవిధంగా ఓవర్ హెడ్ రిజర్వాయర్లు, ఇంట్రా కనెక్షన్ల పనులు కూడా సమాంతరంగా చేస్తూ అనుకున్న లక్ష్యంలోపు మిషన్ భగీరథ ద్వారా నీరందించే విధంగా కృషి చేస్తున్నామన్నారు.